కార్పొరేషన్ కావాలా నాయనా..?

సిక్కులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలైతే వారికి మరింత మేలు జరుగుతుంది కానీ, కేవలం కార్పొరేషన్ వల్ల వచ్చే లాభమేంటో తేలాల్సి ఉంది.

Advertisement
Update:2023-05-08 18:03 IST

ఏపీలో నివసిస్తున్న సిక్కులకు శుభవార్త. వారికోసం కొత్తగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈమేరకు సీఎం జగన్ సిక్కు మత పెద్దలకు హామీ ఇచ్చారు. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిక్కు మత పెద్దలతో సమావేశమయ్యారు జగన్. ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌ జిత్‌ సింగ్‌ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిసి వారి కష్టాలు చెప్పుకున్నారు. తమకు ఓ ప్రత్యేక కార్పొరేషన్ కావాలని కోరారు. వారి అభ్యర్థనకు జగన్ సానుకూలంగా స్పందించారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని కూడా సీఎం జగన్‌ ఆమోదించారు. గురుద్వారాల్లో పూజారులైన గ్రంధీలకు జీతభత్యాలు ఇచ్చేందుకు అంగీకరించారు. గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు దినంగా ప్రకటిస్తామన్నారు. సిక్కులకోసం ప్రత్యేకంగా మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పారు.

కార్పొరేషన్ వల్ల ఉపయోగమేంటి..?

సిక్కులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలైతే వారికి మరింత మేలు జరుగుతుంది కానీ, కేవలం కార్పొరేషన్ వల్ల వచ్చే లాభమేంటో తేలాల్సి ఉంది. ఆ మాటకొస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న కుల కార్పొరేషన్ల వల్ల ఆయా కులాల వారికి జరిగిన ఉపయోగమేంటో ఇంకా తేలలేదు. కేవలం కుల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు మాత్రమే ప్రభుత్వం వద్ద జీతభత్యాలు తీసుకుంటున్నారు. మరి కొత్తగా సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా, ప్రయోజనం కేవలం చైర్మన్, డైరెక్టర్లకు మాత్రమే అనే వాదన వినపడుతోంది.

అడిగితే వరమిచ్చేస్తా..

సార్ మాది ఫలానా కులం ప్రస్తుతం ఫలానా కులంలో ఉపకులంగా కలిసిపోయి ఉన్నాం, మాకు కూడా ఓ కార్పొరేషన్ ఇవ్వండి అని అడగడం ఆలస్యం, సీఎం జగన్ వరమిచ్చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ ఇలా కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. మైనార్టీలో ఒకవర్గమైన సిక్కులకోసం కొత్తగా కార్పొరేషన్ వచ్చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్పొరేషన్లు కూడా ఏర్పడతాయనే అంచనాలున్నాయి. 

Tags:    
Advertisement

Similar News