ఒక బటన్ తో రూ.10 వేస్తారు, ఇంకో బటన్ తో రూ.100 లాగేస్తారు

ఒక బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తున్నారని, మరో బటన్ నొక్కి 100 రూపాయలు లాగేసుకుంటున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. జగన్ దగ్గర రెండు బటన్లు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Update:2023-03-26 10:28 IST

అందరూ అనుకుంటున్నట్టు ఏపీ సీఎం జగన్ దగ్గర డబ్బులు వేసే బటన్ మాత్రమే కాదని, లాగేసుకునే బటన్ కూడా ఉందని సెటైర్లు పేల్చారు నారా లోకేష్. యువగళం పాదయాత్రలో ఆయన జగన్ పాలనపై ధ్వజమెత్తారు. బటన్ నొక్కుతూ కూర్చుంటున్న జగన్, పాలన మరిచాడంటూ ఇన్నాళ్లూ టీడీపీ విమర్శలు గుప్పించింది. అయితే ఈ ప్రచారం ఒకరకంగా జగన్ కి మేలు చేసిందని చెప్పాలి. జగన్ అందిస్తున్న నవరత్నాల పథకాలకి పరోక్షంగా టీడీపీ కూడా ప్రచారం చేసినట్టయింది. అందుకే లోకేష్ సహా టీడీపీ నేతలు రూటు మార్చారు. బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తున్నారని, మరో బటన్ నొక్కి 100 రూపాయలు లాగేసుకుంటున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. జగన్ దగ్గర రెండు బటన్లు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

అప్పుడూ ఇదే బడ్జెట్, ఇప్పుడూ ఇదే బడ్జెట్, ఆ ప్రభుత్వంలో ఇన్ని పథకాలు లేవు, ఈ ప్రభుత్వం మాత్రం డబ్బులన్నిటినీ పేదలకు పంచి పెడుతోందంటూ సీఎం జగన్ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ డబ్బులన్నీ అప్పుడు ఏమైపోయినట్టు అంటూ లాజిక్ తీస్తున్నారు. అదే లాజిక్ తో ఇప్పుడు జగన్ ని కార్నర్ చేస్తున్నారు నారా లోకేష్. అప్పటి నిత్యావసరాల రేట్లకు, ఇప్పటి రేట్లకు పోలిక చెప్పండని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమం పేరుతో డబ్బులు పంచి, మరోవైపు అన్ని వస్తువుల ధరలూ పెంచి, ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు లోకేష్.

ఏడుసార్లు కరెంటు, మూడుసార్లు ఆర్టీసీ చార్జీల పెంపు..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఇప్పుడు మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు లోకేష్. ఆర్టీసీ ఛార్జీల్ని మూడుసార్లు పెంచారని, గతంతో పోలిస్తే నిత్యావసరాల ధరలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయని ధ్వజమెత్తారు. గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయన్నారు. ఓ చేతితో రూ.10 ఇస్తూ మరో చేతితో రూ.100 లాగుతున్నారని మండిపడ్డారు. ఇంటి పన్ను రెట్టింపు చేసి, చెత్త పన్ను తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News