ఏపీలో బీఆర్ఎస్ ఫ్యూచర్ ఇలా ఉంటుంది..

ప్రస్తుతం ఏపీలోని ఉద్యోగ సంఘాలు కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నాయని అభినందించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే కేసీఆర్ సంకల్పం విజయవంతం కావాలని చెప్పారు.

Advertisement
Update:2023-01-14 06:04 IST

“ఏపీలో బీఆర్ఎస్ ని ఎవరు పట్టించుకుంటారు, విభజనతో జరిగిన అన్యాయంపై ప్రజలు ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు, అసలు ఏపీలో బీఆర్ఎస్ కి భవిష్యత్ లేదు..” ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ఇలాగే భుజాలు తడుముకుంటున్నారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పే సంఘటన ఇది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఏపీ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి, ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి, టీఎన్జీవోల నాయకుడిగా సత్తా చాటి, చివరకు కేసీఆర్ దృష్టిలో పడి.. ఇప్పుడు తెలంగాణ మంత్రిగా ఉన్నారు శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి ఏపీలో తమ సహచర ఉద్యోగి, ప్రస్తుత మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. సన్మానించారు.

ఇటీవల కర్నాటకలో పర్యటించిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అక్కడ బీఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతోందన్నారు. తాజాగా ఏపీలో పర్యటించిన ఆయన ఇక్కడ కూడా బీఆర్ఎస్ విజయవంతంగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భౌగోళికంగా విడిపోయినా, తెలుగువారి మనసులు కలిసే ఉన్నాయని చెప్పారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకున్న ఆయన, అనంతరం రెవెన్యూ భవన్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీలోని జేఏసీ, అమరావతి ఉద్యోగుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేతలతో కలసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి లేకుండా సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. ప్రస్తుతం ఏపీలోని ఉద్యోగ సంఘాలు కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నాయని అభినందించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే కేసీఆర్ సంకల్పం విజయవంతం కావాలని చెప్పారు.

బీఆర్ఎస్ పై ఏపీ ప్రజలకు ఇంకా కోపం పోలేదనేది వైసీపీ వాదన. కానీ అది పూర్తిగా తప్పని ఇప్పుడు రుజువైపోయింది. ఏపీ ప్రజలే కాదు, ఏపీలోని వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా బీఆర్ఎస్ ని ద్వేషించడంలేదు. అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. మరి బీఆర్ఎస్ ఎంట్రీతో ఎలాంటి మార్పులు జరుగుతాయో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News