రాజధానుల కేసులో ఏపీ ప్రభుత్వ కొత్త విజ్ఞప్తి

ఈ కేసును ఈనెల 28 కంటే ముందుగానే విచారించాలని కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. ఇదివరకే తేదీ ప్రకటించాం కాబట్టి అదే రోజు కేసు విచారిస్తామని స్పష్టం చేసింది.

Advertisement
Update:2023-03-02 15:05 IST

ఏపీ రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో విజ్ఞప్తి చేసింది. సోమవారమే ఈ కేసును త్వరగా విచారించాలంటూ సుప్రీంకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందుకు స్పందించిన కోర్ట్ ఈనెల 28న కేసు విచారిస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు జస్టిస్ జోసఫ్ ధర్మాసనం ముందు మరో విజ్ఞప్తి ఉంచారు.

ఈ కేసును ఈనెల 28 కంటే ముందుగానే విచారించాలని కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. ఇదివరకే తేదీ ప్రకటించాం కాబట్టి అదే రోజు కేసు విచారిస్తామని స్పష్టం చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కనీసం ఈనెల 28వ తేదీతో పాటు 29, 30 తేదీల్లోనూ వరుసగా కేసు విచారించాలని విజ్ఞప్తి చేశారు. 28వ తేదీన విచారించి ఒక నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వరుసగా మూడు రోజులపాటు విచారించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అందుకు కూడా న్యాయమూర్తి నిరాకరించారు. 29, 30 తేదీలు బుధవారం, గురువారం వస్తాయని ఆ రెండు రోజులు రెగ్యులర్ కేసుల విచారణ వద్దు అని ఇదివరకే ప్రధాన న్యాయమూర్తి ఒక నిర్ణయాన్ని వెలువరించారని, కాబట్టి ఆ రెండు రోజులు విచారించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. దాంతో బుధ, గురువారం కూడా విచారించేలా ప్రధాన న్యాయమూర్తి వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుంటామని, అందుకు సమ్మతించాలని న్యాయమూర్తిని న్యాయవాదులు కోరారు. అందుకు కూడా కోర్టు అంగీకరించలేదు.

ప్రధాన న్యాయమూర్తి వద్ద విజ్ఞప్తి చేసుకోవడం అన్నది మీ ఇష్టమని, తాము ప్రత్యేకంగా అందుకు అనుమతులు ఏమి ఇవ్వలేమని కోర్టు చెప్పింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కోర్టును తొందర పెట్టడంపై అమరావతి తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇదే కేసు హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు పదేపదే వాయిదాలు కోరుతూ జాప్యం చేసిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో మాత్రం ఎందుకు ఇంతగా తొందరపడుతోందని ప్రశ్నించారు. ఇప్పటికే తాము విశాఖ వెళ్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కేవలం సీఎంఓ విశాఖ వెళ్లిన తర్వాత సుప్రీంకోర్టులో తీర్పు ప్రతికూలంగా వస్తే వ్యవహారం బెడిసి కొట్టే అవకాశం ఉంది. అందుకే ముఖ్యమంత్రి విశాఖకు వెళ్లడానికంటే ముందే కోర్టు నుంచి ప్రభుత్వం ఒక స్పష్టత ఆశిస్తున్నట్టుగా ఉంది.

Tags:    
Advertisement

Similar News