పవన్ కు కాపు సెగ

తాను అందరివాడిని అని చెప్పుకుంటున్నా కూడా పవన్ కల్యాణ్ కాపు ఓట్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఆయన కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకునేవారు. 2024లో పవన్ తిరుపతివైపు చూస్తున్నారనే లెక్కలు కూడా ఇందులో భాగంగానే బయటకు వచ్చాయి. ఇటీవల వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ చర్చలు కూడా దీనికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే కాపులంతా పవన్ వెంటే ఉన్నారా..? ఆయన్ను గుడ్డిగా నమ్ముతున్నారా..? జనసేనకోసం కష్టపడితే రేపు పవన్, […]

Advertisement
Update:2022-07-04 05:41 IST

తాను అందరివాడిని అని చెప్పుకుంటున్నా కూడా పవన్ కల్యాణ్ కాపు ఓట్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఆయన కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకునేవారు. 2024లో పవన్ తిరుపతివైపు చూస్తున్నారనే లెక్కలు కూడా ఇందులో భాగంగానే బయటకు వచ్చాయి. ఇటీవల వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ చర్చలు కూడా దీనికి సంకేతంగా చెప్పుకోవచ్చు.

అయితే కాపులంతా పవన్ వెంటే ఉన్నారా..? ఆయన్ను గుడ్డిగా నమ్ముతున్నారా..? జనసేనకోసం కష్టపడితే రేపు పవన్, చంద్రబాబుకి సాయం చేస్తారనే భయం కూడా వారిలో ఉంది. కాపు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసి, కాపు నాయకులపై కేసులు పెట్టించిన చంద్రబాబుని వారు ఎప్పటికీ క్షమించరు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ జనవాణి సభలో కాపులనుంచి ఓ డిమాండ్ ఎదురైంది. ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరిస్తున్న పవన కి, కాపు ఐక్యవేదిక కూడా ఓ వినతిపత్రం అందించింది.

కాపు రిజర్వేషన్లు సహా.. తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై జనసేన పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు కాపు ఐక్యవేదిక నాయకులు.

2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకోసం కష్టపడ్డారు పవన్ కల్యాణ్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పడం, ఆ తర్వాత మాట తప్పడం, ప్రశ్నించిన మాజీ మంత్రి ముద్రగడ హౌస్ అరెస్ట్, నాయకులపై కేసులు.. ఇతరత్రా వ్యవహారాలతో చంద్రబాబుపై కాపు నాయకులు గుర్రుగా ఉన్నారు.

ఈ దశలో ఆయనకు సపోర్ట్ చేసిన పవన్ పై కూడా వారు కినుక వహించారు. ఆ తర్వాత పవన్ బాబు పొత్తుని కాదనుకున్నా.. ఇప్పుడు మళ్లీ ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో అసలు కాపు రిజర్వేషన్లపై జనసేన విధానం ఏంటి అని నిలదీస్తున్నారు నాయకులు. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాపులను వాడుకుంటే కుదరదని, కాపు సామాజిక వర్గానికి కచ్చితంగా న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

పవన్ ఆలోచన ఏంటి..?
కాపు ఐక్యవేదిక డిమాండ్ చేసినట్టు అసలు కాపు రిజర్వేషన్ల గురించి జనసేన ఏమనుకుంటుందో ముందు పవన్ ప్రకటించాలి. ఆ తర్వాత కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న పార్టీతోనే ఆయన జతకట్టాలి. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు మోసం చేసినట్టు కాకుండా.. ఈసారి పక్కాగా తమకు రిజర్వేషన్లు కావాలంటున్నారు కాపు ఐక్యవేదిక నాయకులు. వారిని పవన్ ఎలా బుజ్జగిస్తారు, కాపుల మద్దతుతో ఎలా పార్టీని బలోపేతం చేస్తారు. అసలు ఆయన ఏ పార్టీతో కలసి నడుస్తారు అనే విషయం తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News