కేంద్రంతో తాడో పేడో.. అయిదంచెల ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన టీఆర్ఎస్

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ధాన్యం కొంటామని చెప్పి కేంద్రం మోసం చేసిందని, అందుకే ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈనెల 4నుంచి అయిదంచెల పోరాట ఉద్యమ కార్యాచరణను టీఆర్ఎస్ చేపడుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఏప్రిల్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలతో ఈ పోరాటం మొదలవుతుందని చెప్పారు. ఈనెల 6వతేదీన నాగ్‌ పూర్‌, బెంగళూరు, ముంబై, […]

Advertisement
Update:2022-04-03 03:26 IST

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ధాన్యం కొంటామని చెప్పి కేంద్రం మోసం చేసిందని, అందుకే ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈనెల 4నుంచి అయిదంచెల పోరాట ఉద్యమ కార్యాచరణను టీఆర్ఎస్ చేపడుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఏప్రిల్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలతో ఈ పోరాటం మొదలవుతుందని చెప్పారు. ఈనెల 6వతేదీన నాగ్‌ పూర్‌, బెంగళూరు, ముంబై, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేస్తామన్నారు. ఈనెల 7న తెలంగాణలోని 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నేతృత్వంలో నిరసనలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 8న రైతుల ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేస్తారు, కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. ఇక చివరి ఘట్టంగా ఈనెల 11న దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల నాయకులు, పార్టీ నేతలతో నిరసన ప్రదర్శనలు చేపడతారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలతోపాటు రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

తలాతోకా లేని కేంద్ర ప్రభుత్వం..
కేంద్రంలో ఉన్నది మూర్ఖపు ప్రభుత్వమని, రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తలాతోకా లేవని, పేదలను దోచి కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం మాత్రమే వారికి తెలుసని విమర్శించారు. నూకలు తినాలంటూ తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజలను అవమానించారని.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పై పార్లమెంటులో సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని చెప్పారాయన.

రా రైస్, బాయిల్డ్ రైస్.. తేడాలెందుకు..?
ఆహారభద్రత చట్టం కింద ఏ రాష్ట్రానికి చెందిన ధాన్యాన్నయినా ఎఫ్‌.సి.ఐ. కొనాల్సిందేనని అన్నారు మంత్రి కేటీఆర్. రారైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అనే నిబంధనలు పెట్టొద్దని చెప్పారు. యాసంగిలో వరిసాగు వద్దని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో కేంద్రమే ధాన్యం కొంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు హామీ ఇచ్చారని, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. అసలు బీజేపీ నేతల మానసిక పరిస్థితిపై అనుమానాలొస్తున్నాయని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఒకే నేషన్‌.. ఒకే రేషన్‌ అంటున్న కేంద్రం.. ధాన్యం విషయంలో పంజాబ్‌ కో విధానం? తెలంగాణకి మరో విధానం అమలు చేయడం సరైనదేనా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ తెలివి తక్కువవాళ్లని, వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. కేంద్రం తన వైఖరి మార్చుకునేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News