ఇల్లు చేరుకోవడానికి 850 కిలోమీటర్లు నడిచినా... స్వగ్రామం సమీపంలో వెంటాడిన మృత్యువు

కరోనా సంక్షోభం పలు కుటుంబాలకు శాపంలా మారింది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకొని పోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరు కాని ఊర్లో పని లేక పస్తులుండాల్సి వస్తోంది. దీంతో వందల కిలోమీటర్లు నడిచే స్వగ్రామాలకు వెళ్తున్నారు. అలా స్వగ్రామానికి 850 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ముగ్గురు… కేవలం ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో మృత్యువాతపడ్డారు. ఒక లారీ వారి ప్రాణాలను కబలించడం అందరినీ విషాదంలోనికి నెట్టేసింది. […]

Advertisement
Update:2020-04-30 08:22 IST

కరోనా సంక్షోభం పలు కుటుంబాలకు శాపంలా మారింది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకొని పోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరు కాని ఊర్లో పని లేక పస్తులుండాల్సి వస్తోంది. దీంతో వందల కిలోమీటర్లు నడిచే స్వగ్రామాలకు వెళ్తున్నారు. అలా స్వగ్రామానికి 850 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ముగ్గురు… కేవలం ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో మృత్యువాతపడ్డారు. ఒక లారీ వారి ప్రాణాలను కబలించడం అందరినీ విషాదంలోనికి నెట్టేసింది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన కొంత మంది రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాకు పనుల కోసం వలస వెళ్లారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో పనులు లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పట్లో తిరిగి కూలీ దొరకదని భావించి, ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి కాలినడకన చేరుకున్నారు.

ఉజ్జయిని జిల్లాలోని మోహన్ పుర గ్రామానికి చెందిన వాళ్లు ఊరికి కిలో మీటర్ దూరంలోని ఒక గుడి సమీపంలో రాత్రి నిద్రించారు. కాగా, రోడ్డు పక్కన నిద్రిస్తున్న వీళ్లపై నుంచి ఒక ట్రక్ దూసుకెళ్లడంతో ముగ్గురు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వ్యక్తులు విక్రమ్ సింగ్, అతని భార్య భూలీ, మరో వ్యక్తి బద్రీలాల్ బంజారాలుగా గుర్తించారు. మంగళవారం రాత్రి గుడి సమీపంలో పడుకున్న వీళ్లు తెల్లవారుజామునే ఇంటికి వెళ్తామని భావించారు. కాని ఇంతలోనే లారీ రూపంలో వారిని మృత్యువు వెంటాడింది.

కాగా, 850 కిలోమీటర్లు నడచిన వీళ్లు ఒక కిలోమీటరు దూరంలోని స్వగామానికి వెళ్లకుండా రోడ్డు పక్కన ఎందుకు నిద్రించారనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. వీళ్లు మంగళవారం ఉదయమే స్వగ్రామానికి చేరుకున్నారని.. కానీ స్థానికులు వీరిని గ్రామంలోనికి రానివ్వలేదని చెబుతున్నారు. కోవిడ్-19 పరీక్షలు చేయించుకుని నెగెటివ్ వస్తేనే గ్రామంలోకి అడుగుపెట్టమని గ్రామపెద్దలు చెప్పడంతో వాళ్లు ఉజ్జయిని జిల్లా ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చిన తర్వాత కాలినడకన ఇంటికి బయలుదేరారని.. ఆ సమయంలో గ్రామానికి వెళ్తే రానివ్వరనే అనుమానంతో రోడ్డు పక్కన నిద్రించారని చెబుతున్నారు.

ఈ విషయమై ఉజ్జయిని ఎస్పీని మీడియా వివరణ కోరగా.. వలస కూలీలను గ్రామంలోనికి రానివ్వలేదనే సమాచారం తమ వద్ద లేదని అన్నారు. పోలీసు విచారణ చేపట్టామని.. అలా నిజంగా జరిగితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.

Tags:    
Advertisement

Similar News