మంచు చరియలు విరిగినపడిన ఘటన.. లభ్యం కాని నలుగురి ఆచూకీ
ఇప్పటివరకు రక్షించిన 50 మందిలో నలుగురి మృతి.. ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు;
ఉత్తరాఖండ్ చమోలీలో మంచుచరియల కింద చిక్కుకున్న మరో 4 బీఆర్‌వో కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సహాయక బృందాలు 50 మందిని వెలికితీశాయి. వారిలో తీవ్రంగా గాయపడిన నలుగురు మరణించారు. మంచు మేటల కింద ఇంకా 5 గురు చిక్కుకున్నారని భావిస్తుండగా.. వారిలో ఒకరు క్షేమంగా ఇంటికి చేరినట్లు తెలిసింది. బద్రినాథ్ క్షేత్రం మనా నేషనల్ హైవేపై మంచుమేటలను తొలిగించే పనులను బీఆర్‌వో నిర్వహిస్తున్నది. ఈ పనుల కోసం వచ్చిన 55 మంది కార్మికుల శిబిరంపై శుక్రవారం ఉదయం మంచుచరియలు విరిగిపడ్డాయి. తొలిరోజు 33 మంది, శనివారం ఉదయం మరో 17 మందిని సైన్యం కాపాడింది. సహాయక చర్యల కోసం ఆరు వాయుసేన హెలికాప్టర్లను వినియోగించింది. బీఆర్‌వో శిబిరంలో మొత్తం 8 కంటెయినర్లు ఉండగా.. ఐదింటి జాడ తెలిసింది. మరో మూడు కంటెయినర్ల ఆచూకీ తెలియలేదని లెఫ్టినెంట్ జనరల్ సేన్ గుప్తా వెల్లడించారు. కాపాడిన వారిలో 50 మంది ఐదు కంటెయినర్‌లలో ఉన్నవారేనని తెలిపారు.క్షతగాత్రులను హెలికాప్టర్‌లలో జోషీ మఠ్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.