మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా
సర్పంచ్ దారుణ హత్య ఘటనలో ఆయనపై ఆరోపణలు రాజీనామా కోరిన సీఎం ఫడ్నవీస్;
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ..ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నేడు రాజీనామా చేశారు. దీనిపై ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ముండే రాజీనామాను తాను ఆమోదించి.. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపానని మీడియాకు తెలిపారు.
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలకనేత అయిన ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్‌లో మసాజోగ్ గ్రామ సర్పంచి సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్నది. ఈ హత్యోదంతానికి సంబంధించిన కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.