మలక్‌పేటలో శిరీష హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

శిరీషను ఆమె ఆడపడుచు (భర్త సోదరి) హత్య చేసినట్లు పోలీసులు నిర్దారణ;

Advertisement
Update:2025-03-05 12:42 IST

నగరంలోని మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. శిరీషను ఆమె ఆడపడుచు (భర్త సోదరి) హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. హత్య విషయం తెలిసినా దాన్ని బైటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్‌ మానం చేయాలనుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. వినయ్‌, అతని సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో చిన్న కూతురు శిరీష ను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకున్నది.ఈ పెళ్లి ఇష్టంలేని ప్రొఫెసర్‌ కుటుంబం ఆమెను దూరంగా ఉంచారు. దంపతులిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్‌ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నది. 2019 లో పాప జన్మించింది.

పెళ్లయిన ఏడాది నుంచ భార్యపై అనుమానంతో వినయ్‌ నిత్యం గొడవ పడేవాడు. ఈ నెల 2న ఉదయం 10 గంటలకు భార్య సోదరి స్వాతికి.. ఫోన్‌ చేసి, శిరీష ఛాతి నొప్పితో మరణించినట్లు సమాచారమిచ్చాడు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేటలోని మేనమామ మధుకర్‌కు చెప్పింది. ఆయన శిరీష నంబర్‌కు ఫోన్‌ చేసి, అటునుంచి మాట్లాడిన మహిళతో తానొచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని సూచించాడు. అనంతరం పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆస్పత్రిలో సంప్రదించాడు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్తున్నట్లు వారు సమాచారమిచ్చారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌ డ్రైవర్‌ నంబర్‌ తీసుకొని ఫోన్‌ చేసి.. ఆరా తీయడంతో మృతదేహాన్ని నాగర్‌కర్నూలు తరలిస్తున్నట్లు చెప్పారు. దోమలపెంట సమీపంలో ఉన్నట్లు తెలిపాడు. నగర పోలీసుల సాయంతో అంబులెన్స్‌ డ్రైవర్‌, వినయ్‌తో ఫోన్‌లో మాట్లాడించి మృతదేహాన్ని సోమవారం నగరానికి రప్పించారు. పోస్టుమార్టం కోసం ఉస్మానికాకు తరలించారు.అనుమానాస్పద మృతిగా చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News