కాకి వాలితే... కారు మార్చేసిన సీఎం!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు టైమ్ బాగోలేనట్లుంది. ఇటీవల చేతిగడియారం వ్యవహారం ఒకదశలో ఆయన పదవికే ఎసరు తెచ్చినంత పనిచేసిన విషయం తెలిసిందే! దాదాపు రూ.70 లక్షల రూపాయల వాచ్ ధరించిన సీఎంపై అది ఎక్కడ నుంచి వచ్చిందన్న మీడియాకు సమాధానం చెప్పలేక తంటాలు పడ్డాడు సిద్ధు. జాతీయ మీడియా పుణ్యమాని ఈ విషయం సోనియాగాంధీ దాకా వెళ్లింది. దాన్ని ఆయన వదిలించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన కారు వ్యవహారంపై జాతీయ […]
Advertisement
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు టైమ్ బాగోలేనట్లుంది. ఇటీవల చేతిగడియారం వ్యవహారం ఒకదశలో ఆయన పదవికే ఎసరు తెచ్చినంత పనిచేసిన విషయం తెలిసిందే! దాదాపు రూ.70 లక్షల రూపాయల వాచ్ ధరించిన సీఎంపై అది ఎక్కడ నుంచి వచ్చిందన్న మీడియాకు సమాధానం చెప్పలేక తంటాలు పడ్డాడు సిద్ధు. జాతీయ మీడియా పుణ్యమాని ఈ విషయం సోనియాగాంధీ దాకా వెళ్లింది. దాన్ని ఆయన వదిలించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన కారు వ్యవహారంపై జాతీయ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. విషయమేంటంటే… సిద్ధ రామయ్య కొత్త కారు కొన్నాడు. కొంటే.. ఇందులో కొత్త విషయం ఏముంది అంటారా? ఇంతకు ముందు సీఎం సిద్ధరామయ్యకు ఓ కారు ఉండేది. ఇప్పుడు ఆయన ఆ కారును మార్చేశాడు.
ఇటీవల ఓ కాకి దానిపై వాలింది. కారన్నాక కాకులు వాలడం, రెట్టలు వేయడం సహజమే కదా! అలాంటి ఓ కాకి సిద్ధరామయ్య కారుపై వాలింది. పాపం ఆ కాకికి ఆ కారు సీఎం సిద్ధరామయ్యదని తెలియదేమో? అందుకే వాలిన 10 నిమిషాల దాకా కారుపైనే కూర్చుని కావు.. కావు..! అంటూ అరవడం మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి సిబ్బంది వచ్చి కాకిని తోలుదామని చూసినా.. అది ఎంతకు వెళ్లలేదు. సహజంగా హిందూ సంప్రదాయంలో కాకిని అపశకునంగా భావిస్తారు. దీంతో కాకి వాలిన కారును వాడితే.. తనకు అపశకునంగా పరిణమిస్తుందని సీఎం భావించారు. తన పదవికి గండం వస్తుందనుకున్నారో.. లేకుంటే తన ప్రభుత్వానికే ఆపద వస్తుందనుకున్నారో గానీ, వెంటనే కారును మార్చేశారు. వెంటనే రూ.35 లక్షలు పోసి ఫార్చునర్ కారు కొనేశారు. కారు కొన్నది ఎవరి డబ్బుతో అన్నవిషయం తెలియదు. కానీ, సీఎం కారుపై కాకి వాలిన వీడియో ఇప్పుడు కర్ణాటకలో వైరల్‌లా మారింది. కాకి వాలడంతో అపశకునంలా భావించిన సీఎం కొత్త కారు కొన్నారని రాష్ట్రమంతా చర్చ నడుస్తోంది.
Advertisement