బీఆర్ఎస్‌లో వైఎస్సార్టీపీ విలీనం

ఇప్పుడు YSRTPలో షర్మిల మినహా చెప్పుకోదగ్గ పెద్ద నేతలు ఎవరు లేరు. బీఆర్ఎస్‌లో చేరిన నేతలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇవి చేరికలు కాదు.. బీఆర్ఎస్‌లో వైఎస్సార్టీపీ విలీనం అని ప్రకటించారు.

Advertisement
Update:2023-11-13 21:08 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. షర్మిల సారథ్యంలోని వైఎస్సార్టీపీ ఇప్పటికే ఎన్నికల బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఇక బీజేపీ, జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయి. మొదట కాంగ్రెస్‌లో విలీనం కోసం ప్రయత్నించిన షర్మిల అది సాధ్యం కాకపోవడంతో ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఇంకా ప్రారంభించలేదు.

తెలంగాణలో పోటీ చేద్దామని ప్రకటించి.. తర్వాత షర్మిల వెనక్కి తగ్గడంతో పార్టీ నేతలు ఆమెతో విబేధించారు. చాలా మంది నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటనపై కనీసం తమతో చర్చించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ కొంతమంది నేతలు షర్మిలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. షర్మిలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మిగిలిన నేతలు సైతం సోమవారం మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన నేతల్లో గట్టు రాంచందర్‌ రావుతో పాటు అన్ని జిల్లాల కో-ఆర్డినేటర్లు, కార్యకర్తలు ఉన్నారు.


దీంతో ఇప్పుడు YSRTPలో షర్మిల మినహా చెప్పుకోదగ్గ పెద్ద నేతలు ఎవరు లేరు. బీఆర్ఎస్‌లో చేరిన నేతలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇవి చేరికలు కాదు.. బీఆర్ఎస్‌లో వైఎస్సార్టీపీ విలీనం అని ప్రకటించారు. కీలక నేతలంతా బీఆర్ఎస్‌ గూటికి చేరడంతో కాంగ్రెస్‌లో విలీనం చేద్దామనుకున్న పార్టీ.. ఇప్పుడు బీఆర్ఎస్‌లో విలీనమైనట్లయింది. ఇక ఒంటరిగా మిగిలిన షర్మిల కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారా.. కాంగ్రెస్‌లో చేరతారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

Tags:    
Advertisement

Similar News