ధరణి పోర్టల్‌లో మార్పులా..? రద్దా..?

మధ్నాహ్నం సెక్రటేరియట్‌లో ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక‌ సమీక్ష నిర్వహించ‌నున్నారు. మీటింగ్‌కు రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.

Advertisement
Update:2023-12-13 12:22 IST

ప‌రిపాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్, TSPSC, రైతుబంధు అంశాలను టేకప్ చేసిన రేవంత్ రెడ్డి.. తాజాగా ధరణి పోర్టల్‌పై ఫోకస్ పెట్టారు. ప్రజా దర్బార్‌లో ఎక్కువగా ధరణి పోర్టల్‌పైనే ఫిర్యాదులు అందడంతో దీనిపై దృష్టిపెట్టారు.

మధ్నాహ్నం సెక్రటేరియట్‌లో ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక‌ సమీక్ష నిర్వహించ‌నున్నారు. మీటింగ్‌కు రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. ధరణిలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ఉంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌లో మార్పులు చేయాలా, లేక పోర్టల్ మొత్తాన్ని రద్దు చేయాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ధరణి వల్ల ఎంతో మంది రైతులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతూ వస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ నేతలు అధికారులతో కుమ్మక్కై అసైన్డ్ ల్యాండ్స్‌ను, ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తోంది. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి దాని స్థానంలో కొత్త విధానం తెస్తామని స్వయంగా రేవంత్ రెడ్డే ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోనే ఉండటంతో ధరణి పోర్టల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.

Tags:    
Advertisement

Similar News