ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోంది
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినా గొంతు విప్పరా : మాజీ మంత్రి హరీశ్ రావు
ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినా గొంతు విప్పరా అని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ''నీళ్లు.. నిధులు.. నియామకాల్లో మన వాటా కోసమే తెలంగాణ ఉద్యమం మొదలైందని గుర్తు చేశారు. ''ఈ నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.. ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి, అధికారుల అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నది. గోదావరి నదీ జలాలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తున్నదని, తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు కట్టి పెద్దఎత్తున నీళ్లు తరలించుకపోయే ప్రయత్నాలు చేస్తున్నాయని పత్రికల్లో పతాకశీర్షికల్లో వార్తలు వస్తున్నాయి.. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ ను మూడింతలు పెంచింది.. దీంతో 200 టీఎంసీల నీటిని బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నది.. ఏపీ యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు..'' అని మండిపడ్డారు.
తెలంగాణ చేపట్టిన సీతమ్మ సాగర్, సీతారామ ఎత్తిపోతలు, సమ్మక్క సాగర్, కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టుల అనుమతులు కేంద్రం దగ్గర పెండింగులో ఉన్నాయని, ఈ ప్రాజెక్టులకు క్లియరెన్సులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏపీ 200 టీఎంసీల నీటిని గోదావరి నుంచి పెన్నా బేసిన్ కు తీసుకెళ్లడానికి ఆఘమేఘాల మీద చేస్తున్నా రేవంత్ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి.. దానికి వాటర్ అలొకేషన్ ఉండాలి.. ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి, ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుల అనుమతి కావాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి.. ఇన్ని అనుమతులు వస్తేనే ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉన్నదని వివరించారు. ఏపీ ప్రభుత్వం వీటిలో ఏ ఒక్క అనుమతి లేకుండానే గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు చేపట్టిందన్నారు. ''ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి ఏం చేస్తున్నరు.. ఏపీ ప్రాజెక్టులను ఆపండి అని కనీసం ఉత్తరం కూడా రాయలేదు.. మేం కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం నిధులివ్వండి అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖలు కూడా రాశారు.. ఏడీబీ నుంచి 40 వేల కోట్ల నిధులిప్పిస్తామని వాళ్లు మాట కూడా ఇచ్చారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నదా, సోయి లేదా.. సీఎం స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానిని కలిసి ఈ ప్రాజెక్టులను ఆపాలని అడిగే సోయి లేదా..'' అని నిలదీశారు.
ఏపీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడితే కేంద్రం ఎలా సహకరిస్తుందని నిలదీయాలి కదా అన్నారు. ''ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ నీళ్ల విషయంలో నష్టపోవద్దు.. ఈ ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు ఏం చేస్తున్నట్టు అధికారులు ఏం చేస్తున్నట్టు.. ఏపీ అక్రమంగా కడుతున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద, సుప్రీంకోర్టులో తప్పుడు వాదనలు వినిపించిన ఆదిత్యనాథ్ దాస్ కు 3 నెలల జైలు శిక్ష వేసింది.. ఈ దేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి 3 నెలల జైలు శిక్ష పడ్డదంటే, ఒక్క ఆదిత్యనాథ్ దాస్‌కే.. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసిన ఇలాంటి అధికారిని సలహాదారుగా పెట్టుకున్నరు.. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టి, తెలంగాణ హక్కులను కాలరాసే అధికారి ఎవరి కోసం పనిచేస్తరు.. మీకు సలహాదారుగా పెట్టుకోవడానికి ఇంకెవరూ దొరకలేదా.. తెలంగాణ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? సీఎం ఏమైన గురు దక్షిణ కింద నదీ జలాలను చెల్లించుకుంటున్నరా.. మన రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా.. ఇది చాలా బాధ కలిగిస్తున్నది..'' అని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర నీళ్లను తరలించేందుకు కర్నాటక, ఏపీ కాల్వలు తవ్వుకుంటున్నాయి దీంతో కల్వకుర్తి, డిండి ఎత్తిపోతలు, సాగర్ ఆయకట్టుకు నీళ్లందక దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
2017లో ఏపీ ప్రభుత్వం గోదావరి నీళ్లను పెన్నాకు తరలించేందుకు ప్రయత్నిస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసి ఆపిందని గురత్ఉ చేశారు. ఆ ప్రాజెక్టుపై ఎప్పటికప్పుడు కేంద్ర జలశక్తిశాఖ మంత్రితో పాటు ప్రధానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నామన్నారు. ''బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ - 3 కింద కొత్త ట్రిబ్యునల్ సాధించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే కృష్ణా, గోదావరి జలాలను పునః పంపిణీ చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి కేసీఆర్ లేఖ రాశారు. అప్పటి నుంచి నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్, సుప్రీం కోర్టు వరకు పొరాటం కొనసాగిస్తే కేంద్రం దిగివచ్చి బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి సెక్షన్ -3పై కేవియట్ వేయకపోవడంతోనే సుప్రీం కోర్టులో ఏపీ పిటిషన్ దాఖలు చేసి అడ్డకునేందుకు కుట్రలు చేస్తోంది. బీఆర్‌ఎస్ పదేళ్లు కష్టపడి ట్రిబ్యునల్ సాధిస్తే దాన్ని ఈ ప్రభుత్వం కాపాడి వాదనలు వినిపించకుండా ఎంతో నిర్లక్ష్యం చేసింది..'' అని మండిపడ్డారు. మొద్దునిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడానికే మీడియా ముందుకు వచ్చామని.. రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము వచ్చి సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. ప్రభుత్వానికి అర్థం కాకపోతే తమను అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చిల్లర రాజకీయాలు, తిట్లు, బూతులు మానుకోవాలని హితవు పలికారు. ఇతర రాష్ట్రాలను చూసైనా నేర్చుకోవాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ప్రభుత్వం వెంటనే కండ్లు తెరవాల్సిన అవసరం ఉందన్నారు.