ఆ 8 మంది ఆచూకీపై ఉత్కంఠ!
టన్నెల్ 14వ కి.మీ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు పేరుకుపోయిన బురద
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నది. 8 మంది బాధితులను క్షేమంగా రక్షించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్కూ టీమ్, 24 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సొరంగంలో 13.5 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. అక్కడివరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లడానికి మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకు వెళ్లడానికి యత్నిస్తున్నారు. టన్నెల్ 14వ కి.మీ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది. ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్కబల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల స్థలాన్ని దాటితేనే ప్రమాదస్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ వైద్య బృందాలూ సహాయక చర్యల్లో పాల్గొంటారు. 8 మంది బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుఖేంద్ తెలిపారు. సహాయక చర్యల కోసం నేటి రాత్రికి నేవీ బృందం శ్రీశైలం చేరుకోనున్నది.