'అవకాశం ఇస్తే... తెలంగాణా మోడల్ ను దేశమంతా అమలు చేస్తాం'

ఇప్పుడు కేసీఆర్ బీఆరెస్ పార్టీ ప్రకటించినప్పుడు కేసీఆర్ అర్హతల గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒక సౌత్ ఇండియన్ పార్టీ నార్త్ ఇండియాలో ఎలా గెలవగలదని అంటున్నారని, 11 ఏళ్ళ క్రితం టీఆరెస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాగే అన్నారని అవహేళన చేశారని, తర్వాత ఏం జరిగిందో... ఆ విమర్శించినవాళ్ళు ఏమై పోయారో, ఎక్కడున్నారో తెలియదని... ఇప్పుడు బీఆరెస్ పార్టీ పెడుతున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

Advertisement
Update:2022-10-07 16:32 IST

తెలంగాణ మోడల్ అంటే గుజరాత్ మోడల్ లాగా ఫేక్ కాదని... తెలంగాణ మోడల్ అంటే రైతులను అన్ని విధాలా ఆదుకోవడం, 24 గంటలూ వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వడం, వ్యవసాయం లాభసాటి అని నిరూపించడం, స్వల్ప సమయంలోనే రైతుల ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించడం, న్యూ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తిలో పంజాబ్, హర్యాణాలతో పోటీ పడుతోందని ఆయన చెప్పారు. రైతు బంధుతో స్పూర్తి పొంది కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరిస్తున్నాయని ఆయన గర్వంగా చెప్పారు.

తెలంగాణ సాధించిన అభివృద్దిని దేశవ్యాప్తంగా చెప్తామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి రోజుకు గంటల తరబడి విద్యుత్ కోత ఉండే పరిస్థితి నుంచి 24 గంటలూ కరెంట్ ఇచ్చే పరిస్థితికి చేరుకున్నామని, కరెంట్ లోటు నుంచి మిగులు సాధించామని, 75 ఏళ్ళలో అనేక ప్రభుత్వాలు చేయలేని ఇంటింటికీ తాగు నీరు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్ర‌మాన్ని టీఆరెస్ పూర్తి చేసిందని...ఈ విషయం నేను చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటించక తప్పలేదని కేటీఆర్ తెలిపారు.

టీఆరెస్ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణలో అనేక మంది ఫ్లోరోసిస్ భారిన పడి జీవశ్చవాల్లా బతికే పరిస్థితి ఉండేదని కానీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల తర్వాత ఫ్లోరోసిస్ ను తెలంగాణ నుంచి తరిమికొట్టగలిగామని, తెలంగాణలో వేయికి పైగా గ్రామాల్లో విలయం తాండవం చేసిన ఫ్లోరోసిస్ ఇప్పుడు జాడే లేకుండా పోయిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలు గతంలో ఏడెనిమిది గంటల విద్యుత్ కోతలకు అలవాటు పడిపోయారని, కానీ ఇప్పుడు ఏడెనిమిది నిమిషాల విద్యుత్ కోతలను కూడా తట్టుకోలేకపోతున్నారని ఆయన నవ్వుతూ చెప్పారు.

టీఆరెస్ ప్రభుత్వం వచ్చాక ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు 240 శాతం పెరిగాయని, అలాగే అనేక రంగాల్లో తెలంగాణ ఈ 8 ఏళ్ళలో ఎంతో అభివృద్ది సాధించిందని ఆయన చెప్పారు.

మనం సాధించిన అభివృద్దిని చూసి సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాల ప్రజలు తెలంగాణ మోడల్ ను అమలుచేయమని ఆయా రాష్ట్రాలను అడుగుతున్నారని, అలా చేయలేకపోతే మా గ్రామాలను తెలంగాణలో కలపమని వాళ్ళ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారని... ఇంతకన్నా మన గుడ్ గవర్నెన్స్ కు ఇంకేమి యోగ్యతా పత్రం కావాలని ఆయన ప్రశ్నించారు.

ఇప్పుడు కేసీఆర్ బీఆరెస్ పార్టీ ప్రకటించినప్పుడు కేసీఆర్ అర్హతల గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారని, ఒక సౌత్ ఇండియన్ పార్టీ నార్త్ ఇండియాలో ఎలా గెలవగలదని అంటున్నారని, 11 ఏళ్ళ క్రితం టీఆరెస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాగే అన్నారని, కేసీఆర్ మెదక్ జిల్లా ప్రజలకు తప్ప ఎవరికి తెలుసు ? ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడా ? అంటూ అవహేళన చేశారని, తర్వాత ఏం జరిగిందో... ఆ విమర్శించినవాళ్ళు ఏమై పోయారో, ఎక్కడున్నారో తెలియదని... ఇప్పుడు బీఆరెస్ పార్టీ పెడుతున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేస్తున్నారని చెప్పారు.

ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరిని అడిగినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చారో ఎవరైనా చెప్తారని, అన్ని ప్రతికూలతల మధ్య, ఆర్థిక,అంగ బలాలు లేని పరిస్థితుల్లో కూడా అనుకున్నది సాధించిన కేసీఆర్ బీఆరెస్ విషయంలోనూ విజయం సాధిస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

2024 పార్లమెంట్ ఎన్నికలే బీఆరెస్ టార్గెట్ అని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలే మా మొదటి కార్యక్షేత్రాలని...ఎందుకంటే పొరుగు రాష్ట్రాల వారికే టీఆరెస్ ప్రభుత్వం గురించి, పాలన గురించి తెలుసు కాబట్టి ఆ రాష్ట్రాల నుంచే మా ప్రస్థానం ప్రారంభిస్తామని కేటీఆర్ అన్నారు.

దేశంలో ఇప్పుడు బలమైన ప్రతిపక్షం లేదని, రాజకీయ శూన్యత ఉన్నదని, కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని అనేక రాష్ట్రాల్లో దాని ఉనికే లేదని, ఎక్కడా గెలవలేకపోతుందని, పెద్ద లయబులిటీగా మిగిలిందని... కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి పట్టు లేదని, అనేక మంది నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోయారని, ఇంకా చాలా మంది వెళ్ళిపోతారని... ఇక కాంగ్రెస్ పని అయిపోయింది కాబట్టి ఆ స్థానాన్ని బీఆరెస్ భ‌ర్తీ చేస్తుందని కేటీఆర్ అన్నారు.

మోడీ మీద కోపంతో మేము బీఆరెస్ పెట్టలేదని మా ప్రధాన టార్గెట్ బీజేపీ అయినప్పటికీ...బీజెపి ఒక్కటే మా టార్గెట్ కాదని.... అనేక పార్టీలతోనూ పోటీ పడతామని ఆయన స్పష్టం చేశారు.

మాది పాజిటీవ్ విజన్ అని, మేము విమర్శలను పట్టించుకోబోమని... మాకు చాలా ఓపిక ఉన్నదని, విజయం సాధించేవరకు ఓపికగా పోరాడతామని... తెలంగాణ సాధించడంలో ఎలా సక్సెస్ అయ్యామో, తెలంగాణను ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా అభివృద్ది చేయడంలో ఎలా సక్సెస్ అయ్యామో అలాగే బీఆరెస్ విషయంలోనూ సక్సెస్ అవుతామని, తెలంగాణ మోడల్ ను దేశమంతా అమలు చేస్తామని, అవకాశం ఇస్తే దేశ ప్రజల ముందు మమ్మల్ని మేము నిరూపించుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News