హైదరాబాద్ మెట్రోకు చెల్లించాల్సిన డబ్బును నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం

మార్గదర్శకాలు ఉల్లంఘించిదనే పేరుతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

Advertisement
Update:2022-07-24 11:41 IST

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు చెల్లించాల్సిన పెండింగ్ డబ్బు నిలిపివేసింది. మొత్తం మంజూరైన 1,458 కోట్ల రూపాయల‌లో హైదరాబాద్ మెట్రోకు ఇప్పటివరకు 1,204 కోట్లు మాత్రమే విడుదల చేసి 254 కోట్లు నిలిపివేశారు. మెట్రో రైలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకే ఈ చర్య తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.

హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ జూలై 19న సమర్పించిన 'మెట్రో రైలు ప్రాజెక్టుల అమలు' నివేదికలో నిధులు విడుదలచేయక‌పోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మెట్రో ఛార్జీలను సవరించినందుకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఆపివేసింది.

ప్రాజెక్టు వాస్తవ వ్యయం 18,411 కోట్ల రూపాయలు. అందులో 1204 కోట్లను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ 17,207 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే కేంద్రం ఇవ్వాల్సిన 254 కోట్ల రూపాయలు నిలిపివేసింది.

హైదరాబాద్ మెట్రో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకం ద్వారా PPP మోడల్ ఫండింగ్ కింద తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఆర్థికంగా లాభదాయకంగా లేని ప్రాజెక్ట్‌లకు VGF కింద గ్రాంట్ అందించబడుతుంది.

కాగా 2020-2021లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా హైదరాబాద్ మెట్రో ఆదాయం క్షీణించింది. 2020-2021లో హైదరాబాద్ మెట్రో 1,767 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిందని మెట్రో అధికారుల చెప్తున్నారు. 13,252 కోట్ల రూపాయల భారీ అప్పు, 9.1% అధిక వడ్డీ భారం నష్టాలు పెరగడానికి ప్రధాన కారణాలు. సాధారణంగా, ప్రభుత్వ ప్రాజెక్టులకు 2% వడ్డీ రేటు మాత్రమే ఉంటుంది. కానీ దీనికా వెసులుబాటు లేకపోవడంతో ఏటా దాదాపు .1200 కోట్ల వడ్డీ భారం పడుతోందని మెట్రో రైలు అధికారుల వాదన.

తమ భారీ నష్టాలను దృష్టిలో ఉంచుకొని నిలిపివేసిన 254 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని మెట్రో, ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ''హైదరాబాద్ మెట్రో వల్ల కలిగే భారీ నష్టాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి'' అని మెట్రో తన లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే మెట్రో రైలు నడవడమే కష్టమవుతోందని అధికారులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News