మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే గవర్నర్‌ ప్రసంగిస్తారు

గవర్నర్‌ ప్రసంగం కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉండదన్న సీఎం రేవంత్‌ రెడ్డి;

Advertisement
Update:2025-03-15 13:24 IST

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు కూడా చర్చ కొనసాగుతున్నది. బీఆర్‌ఎస్‌ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడిన అనంతరం ఈ చర్చకు సీఎం రేవంత్‌ రెడ్డి సమాధానం ఇస్తూ... రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయన్నారు. వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిది అన్నారు. గవర్నర్‌ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించాలని అనుకున్నారు. కోర్టు కఠినంగా సూచన చేయడం వల్ల గవర్నర్‌ ప్రసంగానికి అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తి కాదు. బలహీనవర్గాలకు చెందిన మహిళా గవర్నర్‌ను గత ప్రభుత్వం అవహేళన చేసింది. మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగం కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉండదన్నారు. మాది కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజా పాలన అన్నారు.

మా విధానం.. మా ఆలోచనలు.. మేము ప్రజలకు చేసిన పనులు మాత్రమే గవర్నర్‌ ప్రసంగంలో పొందుపరుస్తామన్నారు. అవగాహన లేనివాళ్లు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉన్నదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మంత్రివర్గ ఆమోదం లేకుండానే గవర్నర్‌ ప్రసంగం ఉన్నదా? వాళ్లకు గవర్నర్‌ వ్యవస్థ నమ్మకం లేదన్నారు. మహిళా గవర్నర్‌ను అవమానించారు. ఆ తప్పు మేము చేయమన్నారు. గవర్నర్‌ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది అన్నారు. వారి ప్రసంగంలో సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది అన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు ఇలానే వ్యవహరిస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ గుండుసున్నానే అవుతుందన్నారు. అబద్ధాల ప్రాతిపదిక ప్రతిపక్షాల గొంతు నొక్కాలని మేము అనుకోవడం లేదు. ప్రజల శ్రేయస్సు, వాళ్లకు మేలు జరగాలనే మేము కోరుకుంటున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

అంత కుంచిత స్వభావం నాకు లేదు

రైతులు సమస్యల శాశ్వత పరిష్కారానికి రైతు కమిషన్‌ వేశాం. చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కొట్లాడుతున్నాం. నాడు అధికార పార్టీగా బీఆర్‌ఎస్‌ స్ట్రేచర్‌ ఉండేది. 2023లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా స్ట్రేచర్‌ ఇచ్చారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చి మార్చురీకి పంపించారు. బీఆర్‌ఎస్‌ నేడు మార్చురిలో ఉన్నదని నేను చెప్పాను. అందులో తప్పేమున్నది? పెద్దాయన కేసీఆర్‌ నేను అన్నట్లుగా కేటీఆర్‌, హరీశ్‌రావు చిత్రీకరించారు. అంత కుంచిత స్వభావం నాకు లేదు. కేసీఆర్‌ వద్ద ఉన్న కుర్చీని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గుంజుకుని నన్ను కూర్చోబెట్టారు. చంద్రశేఖర్‌ రావు వద్ద తీసుకోవడానికి ఇంకేమున్నది. వారి వద్ద ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా.. ఆ హోదా కేటీఆర్‌ లేదా హరీశ్‌రావుకు కావాలి. తప్పుడు మాటలు నాకు ఆపాదిస్తున్నారు. కేసీఆర్‌ వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి. నేను ఇక్కడే ఉండాలి. కేసీఆర్‌ సూచనలు చేస్తూనే ఉండాలి.. నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి అని సీఎం అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

మరోవైపు కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం ప్రసంగాన్ని వినబోమన్నారు. 

Tags:    
Advertisement

Similar News