ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డిపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం పార్టీ?

ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనించిన చంద్రబాబు.. ఇక్కడ కూడా పార్టీని తిరిగి పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు.

Advertisement
Update:2022-12-19 08:59 IST

తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉండేది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన అనంతరం పార్టీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఉనికిని కాపాడుకునేలా ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఆ తర్వాత వాళ్లు అధికార బీఆర్ఎస్‌లో చేరిపోయారు. టీటీడీపీ నాయకత్వం కూడా క్రమంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి జంప్ అయ్యారు. మరోవైపు అధినేత చంద్రబాబు చాన్నాళ్లు తెలంగాణలో పార్టీని పట్టించుకోలేదు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్ సహా పలు పార్టీలను ఏకం చేశారు. అధికారంలోకి వస్తే మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పుదామని భావించారు. కానీ తెలంగాణలో చిత్తుగా ఓడిపోవడటమే కాకుండా.. 2019లో ఏపీలో కూడా అధికారం కోల్పోయారు. అప్పటి నుంచి చంద్రబాబు తెలంగాణ రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు.

అయితే, ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనించిన చంద్రబాబు.. ఇక్కడ కూడా పార్టీని తిరిగి పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా తెలంగాణకు అధ్యక్షుడిని కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో టీడీపీకి సీట్లు వచ్చేలా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. అధినేత చంద్రబాబు సూచనతో కాసాని రంగంలోకి దిగారు. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీకి ఇంకా నమ్మకంగా పని చేసే కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన వారిపై కూడా కన్నేశారు. టీడీపీ నుంచి వెళ్లినా.. ఆయా పార్టీల్లో ఇమడలేక, ప్రాధాన్యత లేక అసంతృప్తితో ఉన్న వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి మంతనాలు సాగిస్తున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తిరిగి టీడీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే వాళ్లు ఉంటున్న పార్టీలో ప్రాధాన్యత లేక బీజేపీ వైపు చూస్తున్నారని.. అయితే వారిని టీడీపీలోకి తిరిగి తీసుకొని వచ్చేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరో వైపు కాసానికి తోడుగా.. మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహనరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ సలహాదారులుగా తీసుకున్నారు. వారి సాయంతో ఆ మూడు జిల్లాల్లో ఉన్న నమ్మకమైన కార్యకర్తలను, నాయకులను వెదికే పనిలో పడ్డారు.

హైదరాబాద్‌లో ప్రతీ డివిజన్.. రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని ప్రతీ గ్రామం నుంచి 10 మంది చురుకైన నాయకులను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పుడు టీడీపీ చేపట్టింది. వారిని ముందుగా పార్టీలో యాక్టీవ్‌గా మార్చి.. నెమ్మదిగా ఇతర పార్టీల్లో ఉన్న మాజీ టీడీపీ నేతలను వెనక్కు పిలవాలనే ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగిన సీట్లు గెలవాలని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకున్నది. ముఖ్యంగా మాజీలను తిరిగి తీసుకొని వస్తే అది పెద్ద కష్టమైన పని కూడా కాదని అంచనా వేస్తున్నది.

Tags:    
Advertisement

Similar News