సాగు చేయని భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదు

క్షేత్ర స్థాయికి వెళ్లి అనర్హులను ఏరిపారేయండి : కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2025-01-10 19:14 IST

అనర్హులకు, సాగు చేయని భూములకు రైతుభరోసా ఇచ్చేది లేదని.. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సహా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అనర్హులను ఏరిపారేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్‌ లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా రైతు పెట్టుబడి సాయం అందించారని.. అనర్హులకు సాయం చేయొద్దనేది తమ విధానం అన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తెలంగాణలో ఒక్క కుటుంబానికి ఒక్కచోట మాత్రమే రేషన్‌ కార్డు ఉండాలనేది తమ ప్రభుత్వ నిర్ణయమన్నారు. అందుకే రాష్ట్రంలో వన్‌ రేషన్‌ - వన్‌ స్టేట్‌ విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం నుంచి ఈనెల 15లోగా ఆయా పథకాలు అమలు చేసేందుకు అవసరమైన ప్రిపరేటరీ వర్క్‌ మొత్తం పూర్తి చేయాలన్నారు. ఆయా పథకాలకు గుర్తించి అర్హుల జాబితాలను కలెక్టర్లు జిల్లా ఇన్‌చార్జీ మంత్రికి అందజేయాలని.. ఇన్‌చార్జి మినిస్టర్‌ ఆమోదంతోనే అర్హుల జాబితా విడుదల చేయాలని తేల్చిచెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని తమ ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోందన్నారు. తమ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే 96 శాతం పూర్తి అయ్యిందని, ఇందుకు కృషి చేసిన కలెక్టర్లు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అన్నారు. కలెక్టర్లు తమ పనితీరు మరింత మెరుగు పరుచుకొని ముందుకెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశించామన్నారు. కానీ ఇంకా కొంత మంది ఆఫీసులోనే కూర్చొని పని చేయాలని అనుకుంటున్నారని.. అది మంచిది కాదన్నారు. సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్లు పనితీరును ఇంకా మెరుగు పరుచుకోవాలన్నారు. ప్రభుత్వం పేదల కోసం గొప్పగా పని చేస్తుందన్న నమ్మకం ప్రజలకు కలిగించాలన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టళ్లను సందర్శించి రాత్రిపూట బస చేయాలన్నారు. మహిళా అధికారులు బాలికల హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలన్నారు. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా కలెక్టర్లు, ఇతర అధికారులు కృషి చేయాలన్నారు. రిపబ్లిక్‌ డే తర్వాత తాను జిల్లాల పర్యటనకు వస్తానని.. ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని చెప్పారు. ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.\

Tags:    
Advertisement

Similar News