విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు కోచ్‌లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖ- సికింద్రాబాద్ - విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా కోచ్‌లను పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేసింది. అదనపు కోచ్‌లు జనవరి 11 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మరో 4 కోచ్‌లు పెంచడం ద్వారా ప్రస్తుతం 1,128గా ఉన్న సీటింగ్ కెపాసిటీ 1,414కి చేరనుంది. ఈ మేరకు ప్రస్తుతం 16 కోచ్ లతో నడుస్తున్న ఈ రైలు నేటి నుంచి 20 కోచ్ లతో అందుబాటులోకి వచ్చింది.
దీని ద్వారా నిత్యం వెయిటింగ్ లిస్టు ఉంటున్న ఈ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణీకులు ఈ రైలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రైలులో కోచ్ ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖకు వినతులు అందాయి. దీంతో, రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది. ఇప్పుడు మరో నాలుగు కోచ్ లు పెంచుతూ అధికారులు నిర్ణయించారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త వందే భారత్ రైళ్ల ప్రతిపాదనల పైన దక్షిణ మధ్య రైల్వే కసరత్తు కొనసాగుతోంది.