హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి
సంక్రాంతి పండుగ సందర్బంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈటోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సాధారణంగా 8 టోల్ బూత్‌లు తెరిచి ఉంటాయి. సంక్రాంతి కోసం వాహనాలు బారులు తీరిన నేపథ్యంలో మరో రెండు బూత్‌లను తెరిచారు. పంతంగి టోల్ గేట్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పని చేస్తున్నారు.
చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్ లేకపోవడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలు దేరారు. దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైఓవర్ లేకపోవడంతో స్థానిక పాదచారులు, ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారిని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.