ఎస్సారెస్పీ కాల్వ చివరి భూములకు సరిపడా నీళ్లివ్వాలి
ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
ఎస్సారెస్పీ స్టేజీ -2లోని టెయిల్ ఎండ్ భూములకు సరిపడా నీళ్లివ్వాలని ఇంజనీర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో ఎస్సారెస్పీ పరిధిలో నీటి సరఫరాపై సమీక్షించారు. ప్రాజెక్టు కింద 9.68 లక్షల ఎకరాలకు యాసంగి సీజన్‌లో నీళ్లు ఇచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 25న ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ప్రారంభమైన నీటి విడుదల ఏప్రిల్ 8న ఇచ్చే చివరి తడితో ముగుస్తుందని ఇంజనీర్లు వివరించారు. ఒక్క మడి కూడా ఎండిపోకుండా నీళ్లు ఇవ్వాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీలు అనిల్ కుమార్, విజయభాస్కర్ రెడ్డి, హరిరాం, సీఈలు కె. శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీర్లు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు
ఇరిగేషన్ ఇంజనీర్లు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం జలసౌధలో హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ అసోసియేషన్ కు ఘనమైన చరిత్ర ఉందని, ఆ వారసత్వాన్ని నేటితరం కొనసాగించాలన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాపోలు రవిందర్, చక్రధర్, గౌరవ అధ్యక్షుడు ధర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, నాయకులు మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.