లాభాల బాట పడుతున్న టీఎస్ఆర్టీసీ.. 70 డిపోల్లో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియా
70 డిపోల్లో ఆక్యుపెన్సీ రేషియో సగటున 79 శాతంగా ఉన్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) లాభాల బాట పట్టింది. ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త బస్సులు, కొత్త రూట్లు, డిస్కౌంట్ టికెట్లతో సంస్థ ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్రంలో 96 బస్ డిపోలు ఉండగా వీటిలో 70 డిపోలు లాభాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ 70 డిపోల్లో ఆక్యుపెన్సీ రేషియో సగటున 79 శాతంగా ఉన్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో కూడా టీఎస్ఆర్టీసీ బస్సులో తిరిగే వారి సంఖ్య పెరిగింది. ఒక వైపు ఎండలు మండుతున్నా, విద్యా సంస్థలకు సెలవులు ఉన్నా.. సిటీ బస్సులు ఆక్యుపెన్సీ మాత్రం తగ్గలేదని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జోన్‌తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్టీసీ బలోపేతానికి కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఇటీవల పాత బస్సులను పక్కన పెట్టి.. చాలా రూట్లలో కొత్త బస్సులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీతో పాటు.. ఇంటర్ సిటీ సర్వీసుల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. దీంతో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణానికి టీఎస్ఆర్టీసీని ఎంచుకుంటున్నారు.
కోవిడ్ పాండమిక్ సమయంలో ఆర్టీసీకి భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో కోవిడ్ అనంతరం టీ-6, టీ-24 టికెట్లపై దృష్టి పెట్టింది. దీంతో మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన టీ-6 టికెట్లు భారీగా అమ్ముడు పోతున్నాయి. ఇక టీ-24 టికెట్లు కూడా భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. పురుషులకు ఈ టికెట్లను రూ.90కి, మహిళలకు రూ.80కి అమ్ముతున్నారు. అన్‌లిమిటెడ్ జర్నీ అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు ఈ టికెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు.
టీఎస్ఆర్టీసీ ఇచ్చిన డేటా ప్రకారం టీ-24 టికెట్లు మార్చిలో రోజుకు 22,515 టికెట్లు అమ్ముడు పోగా.. మేలో రోజుకు 32,021కి పెరిగినట్లు స్పష్టమైంది. ఇక టీ-6 టికెట్లు కూడా అప్పట్లో రోజుకు 1,994 టికెట్లు అమ్ముడుకాగా.. మేలో రోజుకు 4,617 టికెట్లకు పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాలకు ప్రయాణించడానికి మహిళలు టీ-6 టికెట్లను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
టీఎస్ఆర్టీసీ సర్వీసుల్లో ఇలాంటి ప్రత్యేక టికెట్ల కొనుగోలు పెరిగింది. దీంతో కార్పొరేషన్‌కు మే నెలలోని ప్రతీ సోమవారం రూ.20 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ టికెట్ల కంటే డిస్కౌంట్ టికెట్ల కొనుగోలు ప్రయాణం చేసే వారికి అనుకూలంగా ఉండటంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో కూడా గత కొన్ని నెలలుగా సగటున 70 శాతంగా నమోదవుతోంది. పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ రేషియో మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.