జగదీశ్‌రెడ్డిపై సస్పెన్సన్‌ను పునఃపరిశీలించాలి
మూడో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు;
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు కూడా చర్చ కొనసాగుతున్నది. అనంతరం ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తారు. ఇవాళ సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ప్రసాద్‌కుమార్ వద్దకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జగదీశ్ రెడ్డి సభాపతిని అగౌరవంగా మాట్లాడలేదు. ఆయనకు అవకాశం ఇచ్చి ఉంటే వివరణ ఇచ్చేవారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్నాం. సభాపతి అంటే మాకు ఎంతో గౌరవం ఉందన్నారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించామని గుర్తు చేశారు. సభ సంప్రదాయాలు పాటించాలని మాకు మా అధినేత ఎప్పుడూ చెప్తుంటారు. సభాపతిని అగౌరవపరచాలన్న అభిప్రాయం మాకు ఎప్పుడూ లేదు. జగదీశ్‌రెడ్డిపై సస్పెన్సన్‌ను పునఃపరిశీలించాలని కోరుతున్నామని హరీశ్ తెలిపారు.
కాంగ్రెస్ డోర్నకల్ ఎమ్మెల్యే రామ్‌చంద్రు నాయక్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో విద్యావ్యవస్థను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. 2014లో గిరిజనులు కాంగ్రెస్ ను కాదని బీఆర్‌ఎస్ వెంట నడిచారు. కానీ వారిని విస్మరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్దికాలంలోనే రాష్ట్రాభివృద్ధి వేగంగా సాగుతున్నది అన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడుతాయని ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కానీ విద్యార్థులను విస్మరించి గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చే అన్ని పథకాలను రద్దు చసి కేవలం రైతుబంధు ఒక్కటే ఇచ్చిందని కానీ రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం చర్చ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించగా, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, బీజేపీల సభ్యులు ఈ తీర్మానంపై చర్చించారు. బీఆర్‌ఎస్ సభ్యులు నేడు మాట్లాడి ఉన్నది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును నేడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. నేడు కూడా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆదిశ్రీనివాస్, వేముల వీరేశం మాట్లాడిన అనంతరం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. అప్రస్తుత అంశాలను ప్రస్తావించి ఇష్యూను డైవర్ట్ చేశారు. ఈ క్రమంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. రెండో రోజు సభలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. దీన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఎల్పీ సచివాలయం దగ్గరలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది.