తెలంగాణలో భానుడు ప్రతాపం..పెరిగిన ఊష్ణోగ్రతలు
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయి;
తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నయి. ఎండకాలం మొదలవకముందే ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయి. ఉగాది అయినా దాటకముందే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవారణ శాఖ అధికారి ధర్మరాజు పేర్కొన్నారు.
ఇవాళ ఆదిలాబాద్ , ఆసిఫాబాద్ , మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయంటూ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు చెప్పారు. రానున్న రెండురోజులపాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ విడుదల చేశారు. అత్యవసరం అయితే తప్ప పగటిపూట బయటికి రావొద్దని హెచ్చరించారు. రాజధాని హైదరాబాద్ లో కూడా 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని సమాచారం.