తెలంగాణలో ఆ గుర్తులు ఉండవు.. ఈసీ కీలక ఉత్తర్వులు
ఆ నాలుగు గుర్తులను ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి మినహాయిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న కొన్ని గుర్తులను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు 193 గుర్తులతో కూడిన ఫ్రీ సింబల్స్ జాబితాను ప్రకటించింది. అయితే వీటిలో ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను రెండు రాష్ట్రాల్లో ఎవరికీ కేటాయించరు.
పైన పేర్కొన్న ఆ నాలుగు గుర్తులను ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి మినహాయిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఆయా గుర్తులు బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారుకు దగ్గరగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆటో, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రాక్కు గుర్తులు కంటి చూపు సరిగా లేని వారికి కారు మాదిరిగానే కనిపిస్తోందని.. దీని వల్ల పార్టీకి పడాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పడుతున్నాయని.. దీంతో నష్టపోతున్నామని గతంలోనే ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ లేఖ రాసింది.
బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన ఈసీ తెలంగాణ ఎన్నికల్లో ఆ నాలుగు గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ ఎవరికీ ఇవ్వొద్దని కోరిన రోటీ మేకర్‌ను మాత్రం ఫ్రీ సింబల్స్ జాబితాలో అలాగే ఉంచడం ఆ పార్టీ నాయకులను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఆ గుర్తును కేటాయించకుండా ఇప్పుడు కోర్టుకు వెళ్లే సమయం కూడా లేదు. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయం నాటికి ఆ గుర్తును కూడా ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించేందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.