పైప్ లైన్ లో సాగునీరు.. తెలంగాణ మరో ప్రయోగం

ఆదిలాబాద్‌ జిల్లాలో మత్తడి ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడానికి ఈ ప్రయోగం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. రూ.7.34 కోట్లతో 9 కిలోమీటర్ల మేర పైప్‌ లైన్‌ వేశారు.

Advertisement
Update:2023-05-07 08:00 IST

సాగునీటి సరఫరా ప్రధానంగా కాల్వల ద్వారా జరుగుతుంది. కొత్తగా కాల్వలు ఏర్పాటు చేయాలంటే భూ సేకరణ చేపట్టాలి, నీటి వృథా కూడా అనివార్యం. అయితే ఇలాంటి సమస్యలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం మరో ప్రయోగం చేపట్టింది. పైప్ లైన్ ద్వారా సాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకూ తాగునీరే ఇలా పైప్ లైన్ల ద్వారా సరఫరా చేసేవారు, ఇప్పుడు సాగునీటిని కూడా తొలిసారి పైప్ లైన్ల ద్వారా పంపిస్తున్నారు తెలంగాణ అధికారులు.

త్వరలో ట్రయల్ రన్..

ఆదిలాబాద్‌ జిల్లాలో మత్తడి ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడానికి ఈ ప్రయోగం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. రూ.7.34 కోట్లతో 9 కిలోమీటర్ల మేర పైప్‌ లైన్‌ వేశారు. మొత్తం 1200 ఎకరాల ద్వారా ఈ పైప్ లైన్ వెళ్తుంది. అయితే ఎక్కడా ఏ రైతుకీ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. రైతుల భూముల్లో పైపులు వేయడానికి 3 నుంచి 4 మీటర్లు తవ్వి పనులు పూర్తయిన తర్వాత పూడ్చేశారు. దీంతో రైతులకు పంటలు సాగు చేసుకోవడానికి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి, ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పైప్ లైన్ ని మొత్తం 25 బ్లాకులుగా విభజించి 225 అవుట్‌ లెట్లు అమర్చారు. ఒక్కో అవుట్‌ లెట్‌ ద్వారా 2.5 హెక్టార్లకు సాగునీరు అందిస్తారు. మొత్తంగా 1200ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

భారత దేశంలో జీవనదులున్నా.. సాగు విస్తీర్ణం మాత్రం ఆ స్థాయిలో లేదనేది కేసీఆర్ వాదన. ఇటీవల మహారాష్ట్ర పర్యటనలో కూడా ఆయన ఇదే విషయాన్ని తెరపైకి తెచ్చారు. సమర్థ సాగునీటి వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అలాంటి విధానాలు అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలని, బీఆర్ఎస్ ని ఆశీర్వదించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ సత్తా ఏంటో ఇప్పటికే ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇప్పుడు సాగునీటికి కూడా పైప్ లైన్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 

Tags:    
Advertisement

Similar News