జీనోమ్ వ్యాలీలో సింజీన్ రూ.788 కోట్ల పెట్టుబడులు.. కొత్త క్యాంపస్‌కు మంత్రి కేటీఆర్ భూమి పూజ

హైదరాబాద్‌లో ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.788 కోట్లతో సింజీన్ కంపెనీ విస్తరణ చేపడుతోందని చెప్పారు. దీని ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Update:2023-09-14 17:11 IST

హైదరాబాద్ కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో కూడా హబ్‌గా మారుతోంది. ఈ క్రమంలో నగర శివారులోని జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ సంస్థ తమ పెట్టుబడులు మరింతగా పెంచేందుకు నిర్ణయించింది. హైదరాబాద్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు వీలుగా కొత్త క్యాంపస్‌ను నిర్మించనున్నది. ఈ నూతన క్యాంపస్‌కు పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానన్నారు. సింజీన్ సంస్థ ఇక్కడ భారీ విస్తరణను చేపట్టడమే ఇందుకు నిదర్శనమని.. ఈ రంగంలో మన రాష్ట్రం అన్ని అవకాశాలను అంది పుచ్చుకుంటుందని కేటీఆర్ చెప్పారు. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ మౌలిక వసతులను చాలా అద్భుతంగా అభివృద్ధి చేశామని చెప్పారు. మంచి రాజకీయ నాయకుల వల్లే మంచి అభివృద్ధి జరగుతుందని చెప్పారు.

తెలంగాణలో ఏదైనా కంపెనీ స్థాపనకు, విస్తరణ కోసం ఎవరి వెంట తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని మంత్రి చెప్పారు. గత రెండేళ్లుగా లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. యూరోప్‌తో పోలిస్తే ఇక్కడ లేబర్ చార్జీలు తక్కువగా ఉన్నాయని.. అందుకే కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెప్పారు. త్వరలోనే లైఫ్ సైన్సెన్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.788 కోట్లతో సింజీన్ కంపెనీ విస్తరణ చేపడుతోందని చెప్పారు. దీని ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సింజీన్ ఏర్పాటుతో హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగం మరింత ముందుకు వెళ్తుందని కేటీఆర్ చెప్పారు.

ఇన్సడ్ ఫార్మా కార్యకలాపాలు ప్రారంభం..

జీనోమ్ వ్యాలీలో స్పెయిన్‌కు చెందిన మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీ ఇన్సడ్ ఫార్మా తమ కార్యకలాపాలు ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ గురువారం జీనోమ్ వ్యాలీలో కంపెనీ ప్రొడక్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇండియాలో వాణిజ్యపరంగా 'అలిగోన్యూక్లియోటైడ్'ను ఉత్పత్తి చేస్తున్న తొలి సంస్థగా ఇన్సడ్ ఫార్మా నిలిచింది. ఇది ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొడక్షన్ సెంటర్లలో ఐదవదని మంత్రి కేటీఆర్ చెప్పారు.

స్పైనల్ మస్క్యూలర్ అట్రోపీ చికిత్సలో 'అలిగోన్యూక్లియోటైడ్'ను ఉపయోగిస్తారు. ఈ ఫెసిలిటీకి యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి కూడా ఉన్నది. అంతే కాకుండా ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి కానున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. 


Tags:    
Advertisement

Similar News