నాయకులకు కండువాల పండగ.. నేతన్నలకు ఉపాధి పండగ

ఇటీవలే బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ఆ సీజన్ పూర్తయిన వెంటనే ఎన్నికల సీజన్ మొదలు కావడంతో వర్క్ ఆర్డర్లు కంటిన్యూ అయ్యాయి.

Advertisement
Update:2023-11-02 06:57 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ప్రత్యేకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఒక్కొకరు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా రెండు పార్టీల్లోకి మారుతున్నారు. మారిన వాళ్లే మళ్లీ మళ్లీ మారిపోతున్నారు. ఈ క్రమంలో వారి మెడలో కండువాలు కూడా మారిపోతున్నాయి. ఆ కండువాల ఆర్డర్లతో చేనేత కార్మికులకు ఉపాధి పెరిగింది.

ఎన్నికలేవైనా జెండాలు, పార్టీ కండువాలకు సిరిసిల్ల బాగా ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడినుంచి కండువాలు, జెండాలు సప్లై చేస్తుంటారు. ఎలక్షన్ సీజన్లో కోట్ల రూపాయల్లోనే వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది బిజినెస్ పెరిగిందని అంటున్నారు మాస్టర్ వీవర్స్. సిరిసిల్లలో 35వేలకు పైగా మరమగ్గాలు, వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. మొత్తంగా ఈ ఏడాది ఎలక్షన్ సీజన్ లో రూ.5కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశముందని అంచనా.

ఇటీవలే బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ఆ సీజన్ పూర్తయిన వెంటనే ఎన్నికల సీజన్ మొదలు కావడంతో వర్క్ ఆర్డర్లు కంటిన్యూ అయ్యాయి. అయితే ఈ ఏడాది కండువాలు, జెండాలకు గిరాకీ మరింత పెరిగింది. ఆ గట్టు, ఈ గట్టు మారుతూ.. నాయకుల ఇళ్లలో అన్ని రకాల కండువాలు ఉండే పరిస్థితి వచ్చింది. దీంతో అన్ని పార్టీల కండువాలకు గిరాకీ పెరిగింది. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి మెరుగైంది. ఈ సీజన్ అయిపోగానే.. సార్వత్రిక ఎన్నికల పని మొదలవుతుంది. అప్పుడు మిగతా రాష్ట్రాలనుంచి కూడా సిరిసిల్లకు ఆర్డర్లు వస్తాయంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News