పారదర్శకంగా బీసీ లబ్దిదారుల ఎంపిక.. కలెక్టర్లపై బాధ్యత పెట్టిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా.. పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు.

Advertisement
Update:2023-06-08 08:48 IST

కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే బీసీలకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్.. ఇప్పటికీ చేతి వృత్తులు, కుల వృత్తులు నమ్ముకొని జీవిస్తున్న వారికి అవసరమైన సామాగ్రి, ముడి సరుకులు కొనుగోలు చేయడానికి రూ.1 లక్ష సాయాన్ని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిజమైన లబ్దిదారులను ఎంపిక చేసే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లపై పెట్టింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా.. పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. సీఎస్ శాంతికుమారితో కలిసి బుధవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ జూన్ 9న మంచిర్యాలలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో త్వరితగతిన లబ్దిదారులను ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించారు. ఆ రోజు కనీసం జిల్లాకు 50 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఆ తర్వాత రోజుల్లో మిగిలిన లబ్దిదారులను గుర్తించి చెక్కులు అందించాలని చెప్పారు.

ఇప్పటికే లబ్దిదారుల రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించినందున.. ఎవరికైనా నమోదు సమయంలో సమస్యలు తలెత్తితే సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలని చెప్పారు. పైరవీలు, ఇతర రికమండేషన్లు పట్టించుకోవద్దని.. నిజంగా చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారిని గుర్తించి.. వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. జూన్ 9నే అందరికీ చెక్కులు ఇవ్వాలనే తొందర వద్దని.. ఆ రోజు పథకం ప్రారంభం కాబట్టే కొంత మందిని గుర్తించాలని మంత్రి కమలాకర్ సూచించారు.

కాగా, రూ.1 లక్ష పథకం జూన్ 9న ప్రారంభం అయినా.. తర్వాత నిరంతరాయం కొనసాగుతూనే ఉంటుందని అధికారులు తెలిపారు. కలెక్టర్లు గుర్తించిన లబ్దిదారులకు ప్రతీ నెల 15న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయస్తారని తెలిపారు. రూ.1 లక్ష సాయం దుర్వినియోగం కాకుండా.. ఆయా సామాగ్రి, ఇతర పనిముట్ల కొనుగోలుకు మాత్రమే వినియోగించేలా చూడటం కూడా అధికారుల బాధ్యత అని మంత్రి కమలాకర్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News