జానా నై.. సర్వే సై
జానారెడ్డి ఏ టికెట్ కోసమూ అప్లయ్ చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ మాత్రం ఎన్నికల బరిలో దిగుతానంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు
అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు, ఆశావహుల నుంచి అందిన దరఖాస్తులతో గాంధీభవన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 119 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే 1000 దరఖాస్తులు దాటాయి. దీంతో వీరిలో సమర్థులని ఎంచుకునే అవకాశం టీపీసీసీకి దక్కింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. ఆయన ఏ టికెట్ కోసమూ అప్లయ్ చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ మాత్రం ఎన్నికల బరిలో దిగుతానంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు.
రెండు టికెట్ల లొల్లి ఎందుకని తప్పుకున్నారా..?
ఈసారి ఎన్నికల్లో ఒక కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ పార్టీ చెప్పేసింది. దీంతో తాను పోటీకి దిగితే తన కుమారుడు జయవీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వరేమెనని జానారెడ్డి డౌట్ పడినట్లు ఉన్నారు. అందుకే తాను అప్లయ్ చేయకుండా తన కుమారుడు జయవీర్‌రెడ్డితో మాత్రం దరఖాస్తు పెట్టించారు. నాగార్జునసాగర్ టికెట్ కావాలని జానారెడ్డి కుటుంబం కోరుతోంది.
కంటోన్మెంట్ సీటు కోసం సర్వే అర్జీ
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అప్లికేషన్ పెట్టారు. తాను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేద్దామనుకున్నానని, అయితే పార్టీ అసెంబ్లీ బరిలో దిగమనడంతో అప్లయ్ చేశానని మీడియాతో సర్వే చెప్పారు. తన అల్లుడు క్రిషాంక్‌రెడ్డికి కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడం వాళ్ల పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. అవసరమైతే అల్లుడిపై పోటీకైనా తాను సై అంటున్నారు సర్వే.
*