అది బ్రిటిష్ జనతా పార్టీ.. అందుకే రిజర్వేషన్లంటే వారికి కోపం

నమో అంటే నమ్మించి మోసం చేయడం అని అన్నారు రేవంత్ రెడ్డి. రైతుల ఆదాయాన్ని అదానీ, అంబానీ, అమెజాన్‌ కంపెనీలకు తాకట్టు పెట్టారని విమర్శించారు.

Advertisement
Update:2024-04-26 09:05 IST

బీజేపీకి కొత్త అర్థం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో బ్రిటిష్ వారి భావజాలం ఉందని అన్నారు. అందుకే వారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఈసారి బీజేపీని గెలిపిస్తే దేశంలో రిజర్వేషన్లు తీసేస్తారని వివరించారు రేవంత్ రెడ్డి. బ్రిటిష్ వారు ఇండియాకు వచ్చినప్పుడు కానీ, వారి పాలనలో కానీ రిజర్వేషన్లు లేవని, ఇప్పుడు బ్రిటిష్ జనతా పార్టీ (BJP) కూడా తిరిగి అలాంటి పరిస్థితుల్ని తేవాలని చూస్తోందన్నారు. వారి ఆలోచనలను మోదీ, అమిత్ షా అమలు చేయాలనుకుంటున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి.

నమో అంటే నమ్మించి మోసం చేయడం అని అన్నారు రేవంత్ రెడ్డి. రైతుల ఆదాయాన్ని అదానీ, అంబానీ, అమెజాన్‌ కంపెనీలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర విభజన అంశాల్లో కీలకమైన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదని, రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని కాజీపేట నుంచి లాతూర్‌కు తరలించారని, తెలంగాణకు ట్రిపుల్‌ ఐటీ ఇవ్వలేదని, ఐటీఐఆర్‌ను రద్దు చేశారని, అతికష్టమ్మీద గిరిజన విశ్వవిద్యాలయాన్ని మాత్రం ఇచ్చారని చెప్పారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి రోడ్ షో లు నిర్వహించారు. రంజిత్‌రెడ్డిని గెలిపిస్తే మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుందన్నారు. మూసీనది ప్రక్షాళనకు లక్ష కోట్ల రూపాయలు అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు రావాలంటే చేవెళ్ల ఎంపీగా రంజిత్‌రెడ్డిని గెలిపించాలన్నారు. మూసీతో పాటు జంట జలాశయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. వికారాబాద్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ప్రాంతాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో కలపాలన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గెలుపుతోనే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News