రేవంత్ కు పాలన చేతకాకనే బీఆర్‌ఎస్ ఆఫీస్ పై దాడి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకనే భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసాలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే దిగజరా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నమ్మించి నయవంచన చేసిన కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం.. వైఫల్యలాను ఎత్తిచూపితే దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు, గుండాగిరి తమ మార్క్ పాలన అని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుందన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని ఫోజులు కొట్టే రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ పాలనలో సాగుతోన్న ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాహుల్ తన హిపోక్రసీని కట్టి పెట్టి గుండాల చేతుల్లో చిక్కన తెలంగాణ కాంగ్రెస్ సర్కారును సరిదిద్దాలని సూచించారు.
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కార్యాలయానికే రక్షణ లేకపోతే ఇక పరిశ్రమలు, పెట్టుబడులకు, మారుమూల పల్లెల్లో నివసిస్తున్న పేద, బడుగు బలహీనవర్గాల ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందో చెప్పాలన్నారు. ఇలాంటి దాడులతో బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడటం అవివేకమని.. సమైక్యరాష్ట్రంలో ఇంతకన్నా వందరెట్ల అణచివేత, నిర్బంధం, దాడులను తట్టుకుని నిలబడ్డామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అని తేల్చిచెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో తిరగగలరా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్కా ర్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు.