వడదెబ్బ.. ఒక్కరోజులో 19 మంది మృతి
అత్యధికంగా కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంటలో 46.7 డిగ్రీలు, భూపాలపల్లిలో 46.3 డిగ్రీలు రికార్డయ్యాయి.
తెలంగాణలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఎండలకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలుతున్నారు. శనివారం ఒక్కరోజే వడదెబ్బతో 19 మంది చనిపోయారు. 22 జిల్లాల్లో వడగాలుల భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ తేమ 15శాతానికి పడిపోయింది. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
46 డిగ్రీలు దాటి..
అత్యధికంగా కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంటలో 46.7 డిగ్రీలు, భూపాలపల్లిలో 46.3 డిగ్రీలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2015, 2017, 2019లో ఇలానే భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటడంతోనే మాడు పగిలేలా ఎండలుంటున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. మధ్యాహ్నం అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది.
కాస్త ఉపశమనం..
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వాతావరణశాఖ చెప్పిన చల్లటి కబురు కాస్త ఉపశమనాన్ని ఇస్తోంది. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.