మరో మూడు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్ లో అప్రమత్తం
అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని హైదరాబాద్ వాసులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
భారీ వర్షాలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు. మరో 3రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో GHMC మరింత అప్రమత్తమైంది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు సిబ్బంది. లోతట్టు ప్రాంతాలవారిని, ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల తర్వాత బల్దియాకు 300 ఫిర్యాదులు రాగా, 280 సమస్యలను పరిష్కరించారు సిబ్బంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ పర్యటించి బాధితులతో మాట్లాడారు.
రంగంలోకి రెస్క్యూ టీమ్
వరదలతో నీట మునిగిన మల్లంపేటలోని బీహార్ స్లమ్ బస్తీ నుంచి 50 కుటుంబాలను రెస్యూ టీమ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. హిమాయత్ నగర్ లోతట్టు ప్రాంతంలో నాలా ఉప్పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది. మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు డీఆర్‌ఎఫ్ టీంలు మోటార్లు పెట్టి నీటిని బయటకు పంపించారు. నల్లకుంట, పద్మానగర్ లో ముంకి గురైన ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. సహాయక చర్యలు చేపట్టారు.
మూసీకి భారీ వరద..
హైదరాబాద్ లో టోలిచౌకి, గాజుల రామారంలో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వరద కారణంగా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీలోకి 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివశించేవారిని అప్రమత్తం చేశారు. నాలాలు పొంగితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 040-2111 1111 కి కాల్ చేయాలని, లేదా డయల్ 100ని ఉపయోగించుకోవాలని, MY GHMC యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కూడా స్కూళ్లకు సెలవలు ప్రకటించింది ప్రభుత్వం. రేపు ఆదివారం కూడా సెలవు కావడంతో సోమవారం లోపు పరిస్థితి సమీక్షించి మరోసారి నిర్ణయం తీసుకుంటారు అధికారులు. అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని హైదరాబాద్ వాసులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.