మోదీ గో బ్యాక్.. పోస్టర్లు, బ్యానర్లతో నిరసనలు

తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో హైదరాబాద్ లో కొన్నిచోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు కనపడుతున్నాయి. చేనేతపై 5శాతం జీఎస్టీని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Update:2022-11-11 09:32 IST

తెలంగాణకు మోసం చేసిన మోదీ, తెలంగాణ గడ్డపై అడుగు పెట్టొద్దంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే తెలంగాణ యూనివర్శిటీల విద్యార్థి జేఏసీ తీవ్రంగా మోదీని హెచ్చరించింది. బుద్ధిజీవుల లేఖ కూడా కలకలం రేపుతోంది. ఇప్పుడిక పోస్టర్లు, బ్యానర్ల వంతు.. రామగుండం నుంచి హైదరాబాద్‌ వయా కరీంనగర్‌ మీదుగా మోదీ రాకపై నిరసన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. అటు సింగరేణి కార్మికులు కూడా నిరసన ప్రదర్శన చేపట్టారు. మోదీ గోబ్యాక్ అంటూ ప్రదర్శన నిర్వహించారు. నల్ల బాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్న బీజేపీ సర్కార్ విధానాలపై కార్మికులు మండిపడ్డారు.

గతంలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో కూడా ఇలా పోస్టర్లు, బ్యానర్లతో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను, మోదీ వైఫల్యాలను పోస్టర్లలో ప్రదర్శించారు. ఇప్పుడు కూడా మోదీకి నల్ల పోస్టర్లతో నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో హైదరాబాద్ లో కొన్నిచోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు కనపడుతున్నాయి. చేనేతపై 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మోదీ గోబ్యాక్ అనే పేరుతో పోస్టర్లు వేస్తున్నారు. దాదాపుగా అన్ని వర్గాల వారు తమ అసంతృప్తిని ఇలా బయటపెడుతున్నారు.


సోషల్ మీడియాలో గో బ్యాక్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోరందుకుంది. ఓవైపు ఏపీ ప్రభుత్వం మోదీ కోసం సకల రాచమర్యాదలతో బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే ఎక్కువ హడావిడి చేస్తోంది. ఇటు తెలంగాణలో మాత్రం మోదీకి నిరసన సెగ తప్పేలా లేదు. సామాన్యుల నుంచి, కేంద్రం విధానాలతో నష్టపోయిన అన్నివర్గాల వారు మోదీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. గో బ్యాక్ మోదీ అంటూ నినదిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News