సీతారామ సాగర్ ప్రాజెక్టు తనిఖీకి ఆదేశాలు జారీ చేసిన ఎన్జీటీ
గోదావరి రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కేంద్ర అటవీ, పర్యవరణ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్) సంయుక్తంగా తనిఖీ చేసి.. ఉల్లంఘనలపై అందిన ఫిర్యాదులపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తనిఖీ చేయాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. గోదావరి నదిపై భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును గోదావరి రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కేంద్ర అటవీ, పర్యవరణ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్) సంయుక్తంగా తనిఖీ చేసి.. ఉల్లంఘనలపై అందిన ఫిర్యాదులపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ములుగుకు చెందిన తెల్లం నరేశ్ అనే వ్యక్తం సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పలు ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంటూ ఎన్జీటీ సదరన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈసీ కోసం తాము గతంలోనే దరఖాస్తు చేసినట్లు ఎన్జీటీకి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంత వరకు ప్రాజెక్టుకు సంబంధించిన ఈసీని జారీ చేయలేదని కూడా పేర్కొంది. కాగా, ఈసీ వచ్చే వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎన్జీటీ స్పష్టం చేసింది.
ఎన్జీటీ పనులు చేయవద్దని చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కొనసాగిస్తోందని మరోసారి తెల్లం నరేశ్ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి 19, మే 7న ప్రాజెక్టు వద్ద పనులు చేశారంటూ ఫొటోలను ఎన్జీటీకి అందజేశారు. దీనిపై ఎన్జీటీ స్పందిస్తూ.. అనుమతులు లేకుండా పనులు చేపట్టవద్దని చెప్పినా.. ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టు స్టేటస్ ఏంటో తాము తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు ఎన్జీటీ చెప్పింది.
మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రీజనల్ డైరెక్టర్, సీనియర్ ఇంజనీర్‌తో పాటు జీఆర్ఎంబీకి చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి తగ్గని అధికారితో కూడిన బృందం సీతారామ ప్రాజెక్టును తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది.