లోటస్ పాండ్ టు చంచల్ గూడ.. వయా నాంపల్లి

తనతో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని, తన చేయి విరిచేయబోయారని, ఆత్మరక్షణ కోసమే వారిని అడ్డుకున్నానని షర్మిల కోర్టుకి తెలిపారు. ఓ దశలో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించినా, ఆ తర్వాత షర్మిలకు 14రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.

Advertisement
Update:2023-04-24 22:29 IST

మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడంతోపాటు, మరో ఎస్సైపై కూడా దురుసుగా ప్రవర్తించినందుకు గాను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికంటూ బయలుదేరిన షర్మిలను ఆమె నివాసం లోటస్ పాండ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ గొడవ మొదలైంది. తనని అడ్డుకోడానికి పోలీసులు ఎవరంటూ గొడవ చేసిన షర్మిల, మహిళా కానిస్టేబుల్ ని చెంపదెబ్బ కొట్టారు, ఎస్సైని పక్కకు తోసేశారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న షర్మిలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3 గా మరో డ్రైవర్ జాకబ్‌ పేర్లు చేర్చారు. 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచే ముందు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. పోలీసులపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని న్యాయవాది కోర్టుకి విన్నవించారు. షర్మిల తన కారుని వేగంగా నడపాలంటూ డ్రైవర్ కి ఆదేశాలిచ్చారని, ఆ కారణంతో ఒక కానిస్టేబుల్ కాలికి గాయమైందని, స్వయంగా షర్మిల ఇద్దరు పోలీసులపై చేయి చేసుకున్నారని, వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. నోటీసులివ్వకుండా షర్మిలను అడ్డుకున్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. తనతో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని, తన చేయి విరిచేయబోయారని, ఆత్మరక్షణ కోసమే వారిని అడ్డుకున్నానని షర్మిల కోర్టుకి తెలిపారు. ఓ దశలో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించినా, ఆ తర్వాత షర్మిలకు 14రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్..

షర్మిల పోలీసులపై చేయి చేసుకోవడం, ఆమెను పరామర్శించడానికి వచ్చిన విజయమ్మ కూడా అదే సీన్ రిపీట్ చేయడంతో.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఫ్రస్టేషన్లో పోలీసులను కొడుతున్నారని ఇదెక్కడి రాజకీయమని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. పోలీసులను కొట్టి, తిరిగి వారినే తిట్టడం విజయమ్మ, షర్మిలకే చెల్లిందని అంటున్నారు. దాదాపుగా రోజంతా షర్మిల, విజయమ్మ వీడియోలే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీనుంచి ఏమాత్రం స్పందన కూడా లేకపోవడం విశేషం.

Tags:    
Advertisement

Similar News