నాది బీజేపీ డీఎన్‌ఏ..పది పార్టీలు తిరిగిన డీఎన్‌ఏ కాదు
బెదిరింపులు, తిట్ల పురాణాలు, అధికారులపై దాడులు, అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించిదేమీ లేదన్న కిషన్‌రెడ్డి
సమస్యలపై మాట్లాడితే నా డీఎన్‌ఏ ఏంటని మాట్లాడుతున్నారు. నాది బీజేపీ డీఎన్‌ఏ. మిగతా వారి మాదిరిగా పది పార్టీలు తిరిగిన డీఎన్‌ఏ కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రేవంత్ పాలనపై ఫైర్ అయ్యారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక పాలనపై దృష్టి సారించాలని సూచించారు.రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ నష్టపోతున్నది. పదమూడు పంటలకు బోనస్ ఇస్తామన్నారు. కనీసం వరికి కూడా ఇవ్వకుండా సన్న బియ్యంతో దాన్ని ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోతున్నది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే. ఏడాది వ్యవధిలో కాంగ్రెస్ సాధించింది ఏమిటి అని ప్రశ్నించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు, అధికారులపై దాడులు, అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించిదేమీ లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు చేసిందేమిటో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పాలన్నారు. ఈ విషయంలో చర్చకు సిద్ధమా అంటూ చిట్ చాట్ సవాల్ చేశారు. వరద నష్టంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు నివేదిక ఇస్తే రూ. 10 వేల కోట్ల నష్టానికి రూ. 400 కోట్లు ఇచ్చి సరిపెట్టారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కిషన్‌రెడ్డి నిజంగా తెలంగాణ డీఎన్‌ఏ అయితే . తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించిన మోడీ వ్యాఖ్యలను ఖండించాలన్నారు. కేసీఆర్ సలహాతో కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారని పొన్నం ఆరోపించారు.