నేను ప్రచారానికి రాను.. అయినా మీకెందుకు..? వెంకట్ రెడ్డి వ్యాఖ్యల కలకలం..

రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడినా, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌కి నమ్మినబంటే అని చెప్పుకోవాలని చూస్తోంది పార్టీ. కానీ కాంగ్రెస్ కవరింగ్ ప్రయత్నాలను తేల్చిపారేశారు వెంకట్ రెడ్డి. తాను ప్రచారానికి రావట్లేదని స్పష్టం చేశారు.

Advertisement
Update:2022-10-12 19:33 IST

కోమటిరెడ్డి వెంకట రెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్లట్లేదు. అది కాంగ్రెస్ పార్టీ అంతరంగిక వ్యవహారం, కాదనలేం. కానీ కాంగ్రెస్ మాత్రం ఆయన ప్రచారానికి వస్తారంటూ కవర్ చేసుకోవాలని చూస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడినా, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌కి నమ్మినబంటే అని చెప్పుకోవాలని చూస్తోంది. కానీ కాంగ్రెస్ కవరింగ్ ప్రయత్నాలను తేల్చిపారేశారు వెంకట్ రెడ్డి. తాను ప్రచారానికి రావట్లేదని స్పష్టం చేశారు.

కలుగులోనుంచి ఎలుకలా..

కోమటి రెడ్డి బ్రదర్స్ కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ అంటూ కేటీఆర్ పేల్చిన పంచ్ డైలాగ్‌తో కలుగులో దాక్కున్న ఎలుక బయటకొచ్చింది. ఆ మాటకి ఫీలయిన వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండించారు. తాను కోవర్ట్‌ని కాదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాను ప్రచారానికి రావట్లేదని తేల్చి చెప్పారు. ప్రచారం విషయంలో సొంత పార్టీకే తాను సమాధానం చెప్పలేదని, మీకెందుకు చెబుతానంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి.

నేను ఫీలయ్యా.. అందుకే రాను..

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫీలయ్యారు. తాను పార్టీలోనే ఉన్నానని తన సోదరుడు మాత్రమే బీజేపీలో చేరారని చెప్పారు. విదేశీ పర్యటన తన వ్యక్తిగతం అని, సొంత పార్టీ నేతలు తిట్టిన బాధతోనే తాను మునుగోడులో ప్రచారానికి వెళ్లడం లేదని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అయినా తను ప్రచారానికి వెళ్లినా, వెళ్లకపోయినా టీఆర్‌ఎస్‌ వాళ్లకెందుకు అని ప్రశ్నించారు..? ఈ ప్రశ్నతో ఆయన కాంగ్రెస్ పరువు తీసేశారు.

కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి..?

వెంకట్ రెడ్డి వస్తారని కాంగ్రెెస్ నేతలంటున్నారు..? నేను రాను అని ఆయన చెబుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా సొంత తమ్ముడు ఓడిపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారానికి వెళ్లట్లేదు. అయితే ఇక్కడ ఆయన కవరింగ్ మాత్రం ఫెయిలైంది. పార్టీ నేతల వల్ల మనస్థాపంతో తాను ప్రచారానికి వెళ్లట్లేదని వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. దీనిపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటో చూడాలి.

Tags:    
Advertisement

Similar News