ఎంపీ అరవింద్ ఓ కుసంస్కారి : పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి
దావోస్ వెళ్లిన కేటీఆర్ ఏం చేశారో అరవింద్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీ గాళ్లకు ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింగ్ ఓ కుసంస్కారి అని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పీయూసీ) చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద అనసవర ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్న వారిలో సంస్కారం లేని వ్యక్తి అరవింద్ అని దుయ్యబట్టారు. అరవింద్ తాగే నీళ్లు, నడిచే రోడ్డు కేసీఆర్ వేసిందే అని అన్నారు. అరవింద్ అడ్డ గాడిదలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దావోస్ వెళ్లిన కేటీఆర్ ఏం చేశారో అరవింద్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీ గాళ్లకు ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. అబద్దాలు మాట్లాడితే అరవింద్ నాలుక చీరేస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్దిపై చర్చకు వస్తావా? ఎక్కడైనా చర్చించడానికి నేను సిద్ధమని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరెంటు లేదన్న అరవింద్.. ఓ సారి కరెంటు తీగలు పట్టుకోవాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. అలాగే ఉంటే ప్రజలు తరిమికొడతారన్నారు. నిజామాబాద్ అభివృద్ధిపై ఈటలతో కూడా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
నందిపేటలో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడం బీజేపీ కుట్ర అని జీవన్ రెడ్డి ఆరోపించారు. బిల్లలు రాలేదనే కారణంతో వాళ్లు ఆందోళన చేయలేదని.. వేరే టెన్షన్‌లో ఉండి అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆ సర్పంచ్ తనకు చెప్పినట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంపీగా అరవింద్ నిజామాబాద్‌కు చిల్లిగవ్వ కూడా తేలేదని.. పసుపు బోర్డు తెస్తా అని అరవింద్ మోసం చేశారని అన్నారు. అరవింద్ పెద్ద అబద్దాలకోరని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం తప్ప అరవింద్‌కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ.. ఎంపీగా అరవింద్‌ను ఎందుకు ఎన్నుకున్నామా అని నిజామాబాద్ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. అరవింద్ అసలు కేసీఆర్ కుటుంబ సభ్యుల కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. వాళ్లను విమర్శించే స్థాయి అరవింద్‌కు లేదన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేతకాని దద్దమ్మలని.. నీచమైన భాష వాడితే అరవింద్ భరతం ప్రజలే పడతారని అన్నారు.