మళ్లీ బుక్కయిన మంత్రి పొన్నం.. ఈసారి దేవుడి సన్నిధిలో..
మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు గంట సమయం పట్టింది. అప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న భక్తులు అసహనానికి గురయ్యారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో ఆలయ సిబ్బంది దర్శనాల క్యూలైన్లను నిలిపివేశారు.
మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు గంట సమయం పట్టింది. అప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న భక్తులు అసహనానికి గురయ్యారు. అసలే ఎండాకాలం ఉక్కపోత, పైగా పిల్లాపాపలతో లైన్లో నిలుచుంటే తీరిగ్గా మంత్రి గంటసేపు దర్శనం చేసుకుంటారా అంటూ భక్తులకు మంటెత్తిపోయింది. మంత్రి కనబడగానే 'మినిస్టర్' డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్ అయిపోయిందని భక్తులను వారించే ప్రయత్నం చేశారు. అయినా భక్తులు వినలేదు. వ్యతిరేక నినాదాలు కొనసాగించారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు కొందరు కొమురవెల్లి మల్లన్నకు జై అంటూ వ్యతిరేక నినాదాలు ఇతరులకు వినపడకుండా కవర్ చేశారు.