వైభవంగా ప్రారంభమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.;

Advertisement
Update:2025-03-01 21:44 IST

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ గోపురానికి బంగారు తాపడం అనంతరం వచ్చిన బ్రహ్మోత్సవాలు కావడంతో.. ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఇవాళ ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 11 వరకూ కొనసాగనున్నాయి. తొలిరోజు శ్రీవిష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం పూజలు.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా జరిగాయి. అర్చకులు ముందుగా గర్భాలయంలోని స్వయంభు నారసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొండపైకి వాహనాలను ఉచితంగా అనుమతించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.ఇవాళ స్వస్తివాచనం, అంకురారోపణం జరగనుండగా ఆదివారం నుంచి 6వ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణం, దేవతాహ్వానం, వేదపారాయణ, హవన, అలంకార సేవలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News