నేడు ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్‌లో నూలు, చిటికీలు, వార్పు, టై అండ్ డైయింగ్, మగ్గాలు, చీరల తయారీ అన్నీ ఒకే దగ్గర జరుగుతాయి.

Advertisement
Update:2023-08-12 07:21 IST

రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రత్యేక, హెవీ డిజైన్లను ఇక్కడ తయారు చేసే అవకాశం ఉన్నది. పట్టు నూలు తీయడం దగ్గర నుంచి పట్టు చీర తయారీ వరకు అంతా ఒకే చోట జరిగే ఈ ఇంటిగ్రేటెడ్ యూనిట్‌ను శనివారం పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. చీరలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలోనే ఈ ప్రత్యేక యూనిట్ నెలకొల్పడం విశేషం. దీని ద్వారా 100 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని ఆ యూనిట్ ఏర్పాటు చేసిన సాయిని భరత్ తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్‌లో నూలు, చిటికీలు, వార్పు, టై అండ్ డైయింగ్, మగ్గాలు, చీరల తయారీ అన్నీ ఒకే దగ్గర జరుగుతాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడకు ఆర్డర్లు వస్తున్నాయి. సాధారణంగా చేనేతకు సంబంధించి అన్ని పనులు ఒక దగ్గర జరగవు. నూలు, చిటికీలు, వార్పు బయట నుంచి కొనుగోలు చేస్తారు. టై అండ్ డైయింగ్‌ను కార్మికులు వేరే చోటు చేపడతారు. నేతకు మరో చోటును ఎంచుకుంటాయి. అయితే పోచంపల్లి చీరలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

కొత్తగా నిర్మించిన రెండస్థుల బిల్డింగ్‌లో ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో చీరల సేల్స్ షోరూమ్స్, మగ్గాలు.. పక్కన షెడ్‌లో టై అండ్ డైయింగ్ పని, మొదటి అంతస్థులో 25 మగ్గాలు, రెండో అంతస్థులో దారం తయారీ యూనిట్ నెలకొల్పారు. బెంగళూరు నుంచి ముడి సరుకు తీసుకొని వచ్చి.. ఇక్కడే మిషన్లపై మూడు, ఐదు పోగుల దారాన్ని తయారు చేయనున్నారు. వీటి ద్వారానే వార్పులు, చిటికీలకు నూలు తయారు చేస్తారు. ఇక్కడ తయారయ్యే చీరలు రకాన్ని బట్టి రూ.8 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉండనున్నాయి.

మంత్రి కేటీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకుడు సాయిని భరత్ తెలిపారు. యూనిట్ ఏర్పాటుపై సూచనలు చేయడమే కాకుండా.. ప్రోత్సాహకాలు కూడా అందిస్తామనే భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News