పరిశ్రమలతోనే ఉపాధి.. ఐటీసీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్

కంపెనీ కోసం భూములు కోల్పోయిన వారిని ఆదుకునే బాధ్యత యాజమాన్యంపై ఉందని, ఆర్థిక సాయంతోపాటు వారికి ఉపాధి మార్గాలను కూడా చూపించాలని సూచించారు.

Advertisement
Update:2023-01-30 13:49 IST

పారిశ్రామికీకరణతోనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పరోక్షంగా రైతులకు ఇతర వర్గాలకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్‌ లో రూ.460 కోట్ల పెట్టుబడితో 59ఎకరాల్లో నిర్మించిన ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఈరోజు నుంచి కంపెనీ అధికారికంగా ఉత్పత్తి మొదలు పెట్టిందని తెలిపారు. ఐటీసీ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు.

50శాతం సిబ్బంది మహిళలే..

మనోహరాబాద్ ఐటీసీ యూనిట్ లో 50శాతం మంది సిబ్బంది మహిళలే కావడం గమనార్హం. కేసీఆర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. ఈ ఫ్యాక్టరీ ఐజీబీసీ నుంచి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ధ్రువీకరణ పొందిందని తెలిపారు. కంపెనీ కోసం భూములు కోల్పోయిన వారిని ఆదుకునే బాధ్యత యాజమాన్యంపై ఉందని, ఆర్థిక సాయంతోపాటు వారికి ఉపాధి మార్గాలను కూడా చూపించాలని సూచించారు. ఐటీసీ కంపెనీ తయారు చేసే చిప్స్, బిస్కెట్స్ కోసం.. ఆలుగడ్డలు, గోధుమలు స్థానికంగానే కొనుగోలు చేయాలని ఐటీసీ చైర్మన్ కి సూచించారు కేటీఆర్.


రైతుల ఆదాయం పెంచేందుకే నీలి విప్లం వచ్చిందని కేటీఆర్ అన్నారు. విజయ డెయిరీ ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతోందని చెప్పారు. పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు. పరిశ్రమలకోసం కాళేశ్వరం ద్వారా 10 టీఎంసీల నీరు అందిస్తున్నట్టు తెలిపారు. నీటి వనరుల సద్వినియోగంలో తెలంగాణ విప్లవం సాధించిందని, ఇంటింటికి మంచి నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమకి , దాణాకి తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు. 46 వేల చెరువులను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేశామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల హబ్ గా తెలంగాణను మార్చేందుకు త్వరలో సెజ్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News