ఫాక్స్ కాన్ కంపెనీ బెంగళూరుకు తరలించే కుట్ర.. కాంగ్రెస్ పై కేటీఆర్ ధ్వజం
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. ఢిల్లీ చేతికి మన జుట్టు అప్పగించొద్దని చెప్పారు. అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్తే.. లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్ కాన్ కంపెనీ బెంగళూరుకు తరలిస్తారని.. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఖండించాలని చెప్పారు కేటీఆర్.
తెలంగాణలో ఉన్న కంపెనీలను కర్నాటకకు తరలించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేయాలనుకుంటున్న ద్రోహం ఇది అని వివరించారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని, ఆ పార్టీకి తెలంగాణలో బుద్ధి చెప్పాలన్నారు. హైదరాబాద్ జలవిహార్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. న్యాయవాదులంతా బీఆర్ఎస్ కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్ కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ కంపెనీకి లేఖ రాయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యాపిల్ ఫోన్లకు సంబంధించిన పరికరాలను తయారు చేసే ఫాక్స్ కాన్ కంపెనీ కోసం నాలుగేళ్లుగా వారి వెంట పడ్డామని, పెట్టుబడులకు ఒప్పించామని గుర్తు చేశారు కేటీఆర్. వివిధ వేదికల్లో కలిసిన తర్వాత 2022లో ఫాక్స్ కాన్ చైర్మన్ హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ ను కలిసి ఫ్యాక్టరీ పెడతామని ప్రకటించారని చెప్పారు. దీని ద్వారా లక్షమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కొంగరకలాన్ లో 200 ఎకరాల స్థలంలో నిర్మాణం కూడా మొదలైందని.. ఈ దశలో ఆ కంపెనీని తరలించాలనే ఆలోచన రావడమే దుర్మార్గం అని అన్నారు కేటీఆర్.
తెలంగాణలో కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత అక్టోబర్-25న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ కంపెనీకి ఓ లేఖ రాశారని.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రావాలని కోరారని.. ఆ లేఖ అన్యాయం కాదా అని ప్రశ్నించారు కేటీఆర్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే, వారిని ఒప్పించే బాధ్యత తమది అని కూడా డీకే తన లేఖలో పేర్కొన్నారని గుర్తు చేశారు. అంటే తెంలగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి విపరీతాలు జరుగుతాయో ఆలోచించాలని చెప్పారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. ఢిల్లీ చేతికి మన జుట్టు అప్పగించొద్దని చెప్పారు. అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్తే.. లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్ కాన్ కంపెనీ బెంగళూరుకు తరలిస్తారని.. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఖండించాలని చెప్పారు కేటీఆర్.