ఆయన్ను బతిమాలి అయినా పర్యాటక మంత్రిగానే ఉంటా..
మెడికల్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, అడ్వెంచర్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం వంటి రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు కేటీఆర్.
మూడో దఫా అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ తనకు పర్యాటక మంత్రిగా అవకాశం ఇస్తే సరి, లేకపోతే ఆయన్ని బతిమాలుకుని అయినా వచ్చే ఐదేళ్లు తాను పర్యాటక మంత్రిగానే ఉంటానని చెప్పారు కేటీఆర్. ఈసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సామాజిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతామన్నారు. పర్యాటక శాఖకు పెద్దపీట వేయాలనుకుంటున్నట్టు చెప్పారు. బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు.
తెలంగాణలో అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ నిధులు లేకుండానే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో మరింత అభివృద్ధి జరిగేందుకు ఛాన్స్ ఉందన్నారు. మెడికల్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, అడ్వెంచర్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం వంటి రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు కేటీఆర్.
అభివృద్ధి రుచిచూపిస్తాం..
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు ప్రజలు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు అందరికీ అభివృద్ధి రుచి చూపిస్తామన్నారు కేటీఆర్. హైదరాబాద్ ను థియేటర్ డిస్ట్రిక్ట్ గా చేస్తామని చెప్పారు. సాఫ్ట్ వేర్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చెందుతున్నట్టే, తెలంగాణ అభివృద్ధి వెర్షన్ కూడా అప్ డేట్ తో సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ‘3.ఒ వర్షన్’ డెవలప్ మెంట్ కు ఐకాన్ గా నిలుస్తుందని పేర్కొన్నారు కేటీఆర్. రాబోయే ఐదేళ్లలో ప్రధానంగా 5 రంగాల్లో అనూహ్యమైన ప్రగతి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు కేటీఆర్. పర్యాటకం, క్రీడలు, విద్య–నైపుణ్యం, వైద్యారోగ్యం, ఐటీ వంటి విభాగాలకు ప్రయారిటీ ఇస్తామన్నారు. గ్రీన్ రెవల్యూషన్ తో ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించామని, నీలి విప్లవం ద్వారా టన్నులకొద్దీ చేపలను తెలంగాణ ఎగుమతి చేస్తోందని, పింక్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్.. ఇలా అన్నిటిలోనూ ముందున్నామని వివరించారు కేటీఆర్.