'అమృత్‌' టెండర్లలో భారీ అవినీతి

ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన ముఖ్యమంత్రి కుటుంబీకులు అమృత్ టెండర్లను దక్కించుకున్నారని కేటీఆర్‌ ఆరోపణ

Advertisement
Update:2024-09-21 09:58 IST

పురపాలకశాఖ పరిధిలో జరిగిన, ప్రధానంగా అమృత్‌ పథకం పనులకు సంబంధించిన టెండర్లపై విచారణ జరిపించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ చేశారు. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబీకుల అక్రమాలకు సాక్షాలను బయటపెట్టారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు కేటీఆర్ లేఖ రాశారు.

అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన దక్కించుకున్న రూ. 1,137 కోట్ల రూపాయల పనుల తాలూకు పత్రాలను కేటీఆర్‌ బైటపెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను రేవంత్ రెడ్డి కుటుంబం దక్కించుకున్నదని ఆరోపించారు. ఆ తర్వాత ఇదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోధ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీతో ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్నది.

ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పజెప్తుందని కేటీఆర్‌ ఆరోపించారు. వాటి తాలూకు సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతుందని రేవంత్ రెడ్డి పై ఆరోపించారు.

అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తిస్థాయి విచారణ జరిపి, టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తొమ్మిది నెలలుగా రాష్ట్రంలోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ టెండర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News