టీ కాంగ్రెస్‌లో చిచ్చురాజేసిన మండల కమిటీలు

హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని డివిజన్‌లలో తమవారికి ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు కూడా గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు.

Advertisement
Update:2023-07-08 11:10 IST

ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న టీ కాంగ్రెస్‌కు రోజుకో కొత్త సమస్య ఎదురవుతోంది. అసంతృప్తి జ్వాలలు, అలకలు, ఫిర్యాదులు సర్వసాధారణంగా మారిన టీ కాంగ్రెస్‌లో మండల కమిటీలు కొత్త చిచ్చు పెట్టాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీ పీసీసీ మండ‌ల కమిటీలను ప్రకటించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీలకు బాధ్యులను నియ‌మించారు. కానీ కమిటీల ప్రకటన వెలువడిన వెంటనే అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తాయి. కమిటీల ఏర్పాటులో సోషల్ ఇంజనీరింగ్ వర్కవుట్ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే బీసీ నేతలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ జనాభాకు తగ్గట్టుగా పార్టీ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు టికెట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆశావహులంతా వారి సన్నిహితులకు మండల, డివిజన్ కమిటీలలో చోటు దక్కేలా చక్రం తిప్పారు. కమిటీల ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో కీలక నేతలుగా కొందరు తమ వర్గానికి చెందిన వారికి పదవులు దక్కలేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఈ విషయంలో పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారట.

మహబూబాబాద్ జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మురళీ నాయక్ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే బలరాం నాయక్‌ రాష్ట్ర పార్టీలో చక్రం తిప్పి తన వారికి మండల అధ్యక్ష పదవులు వచ్చేలా లాబీయింగ్ చేసారని టాక్. దీంతో మిగతా ఇద్దరు నేతలు రగిలిపోతున్నారట. ఇక మునుగోడులోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వాయి స్రవంతి ఏకంగా గాంధీ భవన్‌లో నిరసన వ్యక్తం చేసింది. తమ వారికి మండల కమిటీలలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించింది.

హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని డివిజన్‌లలో తమవారికి ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు కూడా గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆందోళన చేప‌ట్టిన నేతలు నిజమైన కార్యకర్తలనే మండల అధ్యక్షులుగా నియమించాలని డిమాండ్ చేశారు. వీరే కాకుండా త‌మ వ‌ర్గానికి ప‌ద‌వులు ద‌క్కలేదని భావిస్తున్న నేతలంతా నిరసనలకు రెడీ అవుతున్నారట. దీంతో మండ‌ల క‌మిటీల మంట‌లు పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తాయ‌నే ఆందోళ‌న గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో పార్టీకి పాజిటివ్ వేవ్ వస్తుందనుకున్న సమయంలో ఇలాంటి సంకటం వచ్చిపడడంతో ఇప్పుడు నేతలు తలలు పట్టుకుంటున్నారట. మరి ఈ సమస్యకు ఎలా చెక్‌ పెడతారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News